కొండాపూర్, సెప్టెంబర్ 20: గతంలో కొనసాగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కొనసాగించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం శేరిలింగంపల్లి పరిధిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ఎదుట ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం, పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయులను తొలగించడం, ఉత్తమ ఉపాధ్యాయులను విద్యా సంవత్సరం మధ్యలో మార్చడం కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ… కళాశాల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతోపాటు కాంట్రాక్టు పద్ధతిలో ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న సబ్జెక్ట్ టు అసోసియేట్స్‌ను తొలగించారని పేర్కొన్నారు. వారి స్థానంలో వచ్చిన కొత్తవారికి కనీస అవగాహన లేకపోవడంతో విద్యార్థులు చదువుల్లో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తున్నదని పేర్కొన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థులను కళాశాల ఉన్నతాధికారులు టార్గెట్ చేస్తున్నారని, తమ పిల్లలకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.