Paddy Procurement | హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): సర్కారు, రైస్‌మిల్లర్ల మధ్య పంచాయితీ, పంతంతో రైతులు బలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తెచ్చిన పాలసీ జీవో 27ను రైస్‌మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులోని పలు నిబంధనలు మార్చేవరకు ధాన్యం దించుకోబోమని తెగేసి చెప్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా మిల్లర్ల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నది. ఇద్దరి మధ్య పంచాయితీతో ధాన్యం కొనుగోలులో కీలకమైన మిల్లర్లతో ఒప్పందం ప్రక్రియ మొత్తంగా నిలిచిపోయింది. ఈ విధంగా ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్ల పంతంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట మొత్తం ఇటు కల్లాల్లో, అటు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్నది. ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ధాన్యం దించుకోం..
రాష్ట్రంలో కొద్ది రోజులుగా సర్కారు వర్సెస్ రైస్ మిల్లర్ల కథ నడుస్తున్నది. అక్టోబర్ 29న ప్రభుత్వం విడుదల చేసిన కొనుగోళ్ల పాలసీతో ఇది మరింత ముదిరింది. కొత్త పాలసీని మిల్ల ర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రెండు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేస్తున్నారు. ధాన్యం దించుకున్న మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పా టు సన్నధాన్యంలో అవుట్ టర్న్ రేషియో తే ల్చకుండా దించుకోవాలని ఒత్తిడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు సమస్యలు పరిష్కరికుండా ధాన్యం దించుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో మిల్లర్లు ఆయా కలెక్టర్లకు వినతిపత్రాలు కూడా అందించారు. అయితే జనగాం, నిజామాబాద్‌లో మాత్రం అక్కడి మిల్లర్లను బెదిరించి ధాన్యం దించుకునేందుకు ఒప్పించినట్టుగా తెలిసింది. మిగిలిన జిల్లాల మిల్లర్లు మాత్రం సమస్యలు పరిష్కరించే వరకు ధా న్యం దించుకోమని చెబుతున్నారు.
మొండిగా సర్కారు
మిల్లర్లతో పంచాయితీతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ప్ర భుత్వం ఇవేవి పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతు ల ఇబ్బందులను తొలగించేందుకు కనీస ప్ర యత్నాలు కూడా చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మిల్లర్ల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము చేసేదే చేస్తాం.. మిల్లర్లు వస్తే రానీ లేకపోతె లే దు అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిసింది. నిబంధనలను సడలించేది లేద ని అధికారులు స్పష్టం చేసినట్టుగా తెలిసింది. దీంతో ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా మిల్లర్లతో పంచాయితీ ఇప్పట్లో తెగే అవకాశంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిలిచిపోయిన కొనుగోళ్లు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి నెల రోజులవుతున్నది. అయినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం గమనార్హం. మిల్లర్లు, సర్కారు పంచాయితీతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు గుట్టలను తలపిస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకోవాల్సిన మిల్లర్లతో ఒప్పందాలు కాకపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు చేతులెత్తేస్తున్నారు. పేరుకే 7572 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 4598 కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. ఇందులో సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు ప్రారంభంకానట్టుగా తెలిసింది. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో కల్లా లు, కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయి, నీళ్లలో కొట్టుకుపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రైతుల గోసను చూసి కూడా ప్రభుత్వం చలించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో నేతాజీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు.
20 రోజులైనా ధాన్యం కొంటలేరు
కాంగ్రెస్ సర్కారు 20 రోజులైనా ధాన్యం కొంటలే దు.. టార్పాలిన్ల కిరాయే వేలల్లో అవుతుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. శనివారం మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రా మంలో ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు వెంట నే కొనేవారు.. మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తుచేశారు. అనంతరం మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యేకు చూపించారు. ఆమె వెంట మాజీ జడ్పీటీసీలు ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు తదితరులు ఉన్నారు.