హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకులతోపాటు మంత్రులు సైతం మండిపడుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి భారీగా ఆదాయాన్ని దండుకుంటున్న రేవంత్‌రెడ్డి సర్కారు ఐటీ, పరిశ్రమల శాఖకు నామమాత్రపు కేటాయింపులతో సరిపెట్టిందని, బడ్జెట్లో రూ.3,317 కోట్లు మాత్రమే కేటాయించిందని స్వయంగా ఆ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబే ధ్వజమెత్తారు. ఇందులో ఐటీ రంగానికి కేటాయించిన రూ.774 కోట్లు మినహాయిస్తే పరిశ్రమల శాఖకు దక్కేది రూ.2,543 కోట్లు మాత్రమేనని పెదవి విరిచారు. ఈ నిధులు పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలకు కూడా సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నవారికి వివిధ పథకాల కింద దాదాపు రూ.3 వేల కోట్ల సబ్సిడీలు చెల్లించాల్సి ఉన్నదని వాపోయారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చేందుకు, కొత్త ఇండస్ట్రియల్ పార్క్‌ల అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తేవాలన్నది అంతుబట్టకుండా ఉన్నది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి, రాయితీల కోసం బడ్జెట్లో కనీసం రూ.5,200 కోైట్లెనా కేటాయించాలని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. కానీ, బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఇందులో సగం కూడా లేకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెడతామని పదేపదే చెప్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తాత్కాలిక బడ్జెట్లో దాని ఊసే ఎత్తలేదు. దీంతో ఆ పాలసీ కోసం ఎదురు చూస్తున్నవారందరికీ నిరాశ తప్పలేదు. నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులు, పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనలు తీసుకున్నది. దీంతో కొత్త పాలసీలో ప్రకటించే సబ్సిడీలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీలతోనే సరిపెడతారా? లేక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా వాటా కలుపుతుందా? అని ఎదురుచూస్తున్నారు.