హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ యం త్రాంగం ఎన్నికల జీవోకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన గడువులో ఇప్పటికే మూడు వారాలు గడిచిపోగా, వారం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ లోగా రిజర్వేషన్ల కేటాయింపులో న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచన చేస్తున్నది.
తమిళనాడు, బీహార్లో ఎన్నికలకు రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారు? వంటి అంశాలను పరిశీలిస్తున్నది. రాష్ట్రానికి ఉన్న అధికారాలను వినియోగించుకొని రిజర్వేషన్లు అమలుచేసే వ్యవహారాన్ని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు అప్పగించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జీవో ఇచ్చే ముందు క్యాబినెట్ ముందు పెట్టాల్సిన అంశాలపై మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ సృజన, లా సెక్రటరీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్లు, ఇతర రాష్ర్టాలు అనుసరించిన విధానాలు, ఆర్టికల్ 243డీ ప్రకారం రిజర్వేషన్, న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని అన్ని అంశాలను ఈ నెల 10న జరిగే క్యాబినెట్ ముందు పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, వీలైనన్ని ఎక్కువ అంశాలు క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లే కసరత్తు జరుగాలని సీఎం సూచించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలుచేశారు. బీసీలకు పంచాయతీల్లో 22.78 శాతం, మండల పరిషత్లో 18.77 శాతం, జిల్లా పరిషత్లో 17.11 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఇప్పుడు రేవంత్ సర్కారు నియమించిన బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గడువు ముగిసింది. దాంతో మళ్లీ కమిషన్ వేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్టు తేలింది. దీని ఆధారంగా బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల సిఫారసులను కమిషన్ ఆరు క్యాటగిరీలుగా విభజించింది. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతోపాటు ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్.. ఇలా ఆరు రకాల నివేదికలను తయారుచేసి, ఆయా పదవుల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల వివరాలను నివేదికలో పేరొన్నది. పార్లమెంటు ఆమోదం లేకుండా ఈ రిజర్వేషన్ల అమలు అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఈ అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు నేరుగా రాష్ట్ర ప్ర భుత్వమే జీవో ఇచ్చి, రిజర్వేషన్లు ప్రకటిస్తే మొత్తం 70 శాతం మించుతాయి. అలా చేస్తే న్యాయపరమైన చికులు తప్పవు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను కోర్టు రద్దు చేసింది. ఈ లెకన బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కష్టమేనన్న అభిప్రాయాలూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లపై ఆర్టికల్ 243డీ ప్రకారం అంటే.. ఎస్సీ, ఎస్టీపోగా, మిగిలిన వాటిని బీసీకి ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంపైనా చర్చ నడుస్తున్నది. అన్ని అంశాలను పరిగనణలోకి తీసుకొని ప్రతిపాదించేందురకు అధికారయంత్రాంగం తర్జనభర్జన పడుతున్నది. ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణ యం తీసుకొని రిజర్వేషన్లు కేటాయిస్తూ అమలుకు వారంలోగా జీవో జారీచేస్తుంది. ప్రభుత్వం జీవోను హైకోర్టులో సవాల్ చేయడానికి వీలుపడకుండా శనివారం విడుదల చేసి సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలా కూడా ప్రభు త్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.