Gadwal | ఉండవెల్లి : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుధవారం తెల్లవారుజామున నుంచి ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగుకు వరద భారీగా రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన మెన్నిపాడు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాధ, ఉపాధ్యాయుడు ప్రభాకర్ వాగు ఉధృతిని చూసి అక్కడే ఆగిపోయారు. గ్రామస్తులు, విద్యార్థుల సహకారంతో ఉపాధ్యాయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. అనంతరం స్కూల్కు చేరుకొని విద్యార్థులకు పాఠాలు బోధించారు. విధులపై అంకితభావం ఉన్న ఉపాధ్యాయులను గ్రామస్తులు కృతజ్ఞతలతో ముంచెత్తారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి వాగుపై హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.