హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హిల్‌ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రత్యేక సమావేశం ఉన్నందున సీఎస్ విచారణకు హాజరుకాలేదని వివరించారు. హిల్‌ఫోర్టు ప్యాలెస్ పునరుద్ధరణ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్టు దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వందేండ్లకు పైబడిన ఆ చారిత్రక భవనంపై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తోపాటు పలువురు ఇంజినీర్లు అధ్యయనం చేసి ఈ నెల 14న నివేదిక ఇచ్చారని ఏజీ చెప్పారు. తదుపరి విచారణకు సీఎస్ , పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హాజరుకావాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది.