హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్‌పై ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రచురితమైన ‘లంచమిస్తే ఓకే.. లేదంటే వేటే!’ కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫేక్ అటెండెన్స్ వేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అటెండెన్స్ విషయంలో లోటుపాట్లను సరిదిద్దేందుకు అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
మండల పంచాయతీ అధికారులు ప్రతి రోజూ పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించాలని ఆదేశించింది. హాజరులో అవకతవకలకు పాల్పడినట్టు గుర్తిస్తే.. వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మూడు రోజుల్లో వివరణ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమోలు జారీ చేయాలని ఆదేశించింది. పంచాయతీ కార్యదర్శులు నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వని పక్షంలో విచారణకు అధికారిని నియమించాలని స్పష్టంచేసింది.