Special Police | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బెటాలియన్ కానిస్టేబుళ్లతో టీజీఎస్పీ ఉన్నతాధికారుల చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. 26 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజులు సెలవు ఇస్తున్న విధానంపై బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో 15 రోజుల డ్యూటీ తర్వాత 2 రోజుల సెలవును ఉపయోగించుకునే విధానంలోనూ మార్పు చేసి, 12 రోజుల డ్యూటీ తర్వాత 2రోజులు సెలవు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు టీజీఎస్పీ బెటాలియన్ ఉన్నతాధికారులు కానిస్టేబుళ్ల నాయకుల ముందు ప్రతిపాదనలు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అత్యవసరం అనుకుంటే 1 సీఎల్, హెల్త్ ఎమర్జెన్సీ అయితే 1 ఈఎల్ పెట్టుకునే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు.
‘ఏక్ పోలీసు’విధానంపై స్టడీ చేయాలని కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏయే రాష్ర్టాల్లో ఏక్ పోలీసు అమలు చేస్తున్నారు? అక్కడ ఉన్న నిబంధనలు ఏంటి? క్షుణ్నంగా అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయాల్సిన పరిస్థితులపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఇక 3-5 ఏండ్లు ఒకే చోట పోస్టింగ్ కావాలంటే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, కానీ జిల్లాల సరిహద్దుల్లో డ్యూటీలు వేస్తే అక్కడ విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉంటారా? అని చర్చల్లో అధికారులు కానిస్టేబుళ్లను ప్రశ్నిస్తున్నారు. మళ్లీ అక్కణ్నుంచి సిటీ పరిధుల్లోకి బదిలీ చేయాలంటూ మరో ఆందోళన చేయరనే గ్యారెంటీ ఏంటని అడుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే నెలలో రికార్డెడ్ పర్మిషన్ 4 రోజులు ఇస్తుండగా, కొందరు ఆర్ఐలకు డబ్బులిచ్చి 6-10 రోజులు సెలవులు పెడుతున్నట్టు తెలిసిందని చెప్పారు.
బెటాలియన్ కానిస్టేబుళ్లను స్ఫూర్తిగా తీసుకుని సివిల్ వాళ్లు, వాళ్లను చూసి ఏఆర్ వాళ్లు ఆందోళనల బాటపడితే పోలీసు వ్యవస్థకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతోనే బెటాలియన్ కానిస్టేబుళ్లపై వేటు వేసినట్టు అధికారులు కానిస్టేబుళ్లకు చెబుతున్నారు. ఉద్యోగం చేయడం నచ్చకపోతే వెంటనే రాజీనామా చేసి వెళ్లాలి కానీ ఆందోళనలు చేస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే ఎలా? అని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఎవరో రెచ్చగొడితే ఆందోళనలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు.