పెద్దపల్లి : కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. జిల్లా కేంద్రంలోని పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో రూ.70 లక్షలతో ఎన్టీపీసీ, సీఎస్ఆర్ తో నిర్మించిన ఎనిమిది అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాలు, మోడల్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, డీఈవో మాధవి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.