Public Holidays | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): వచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది, ఆగస్టు 27న వినాయకచవితి, అక్టోబర్ 3న దసరా, 20న దీపాపళి పండుగలు ఉండనున్నాయి.
సాగర్ నీటి లెక్కలపై మళ్లీ లొల్లి ;నీటి లెక్కలను నమోదు చేయకుండా అడ్డుకున్న ఆంధ్రా అధికారులు
నందికొండ, నవంబర్ 9 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ వద్ద ఏర్పాటు చేసిన మీటర్ గేజ్ నుంచి నీటి విడుదలకు సంబంధించిన లెక్కను నమోదు చేసేందుకు శుక్రవారం వెళ్లిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులను ఆంధ్రా అధికారులు అడ్డుకున్నారు. ‘కుడి కాల్వ నీటి విడుదల లెక్కలను మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ అధికారులు మా ప్రాంతంలోకి రావద్దు’ అని వాగ్వాదానికి దిగారు. విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న ఉన్నతాధికారులకు, కృష్ణా రివర్ బోర్డు అధికారులకు తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు శనివారం ఇరు రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు చర్చించి సమస్యను పరిష్కరించుకున్నారు. తెలంగాణ అధికారులు కుడికాల్వ నీటి విడుదల రీడింగ్‌ను నమోదు చేసి కృష్ణా రివర్‌బోర్డు అధికారులకు పంపించారు. ఆంధ్రా ప్రాంత ఇరిగేషన్ ఏఈ వెంకటసుబ్బయ్య వల్లే జలవివాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.