ఇప్పటికే రెండు బ్యాచ్‌లు పూర్తి
డ్రోన్ టెక్నాలజీలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సర్కారు చర్యలు
హైదరాబాద్, మార్చి 10: డ్రోన్ రంగంలో సరళీకృత విధానాలతో వాటిని ఆపరేట్ చేసే నైపుణ్యం గల పైలట్ల(డ్రోన్ పైలట్లు)కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అత్యుత్తమ డ్రోన్ పైలట్లను తయారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ(టీఎస్‌ఏఏ) ద్వారా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. హైదరాబాద్‌లోని భాగస్వామ్య కంపెనీలతో కలిసి టీఎస్‌ఏఏ ఇప్పటికే రెండు బ్యాచ్‌ల్లో 70 మందికి శిక్షణ ఇచ్చింది. మూడవ బ్యాచ్‌కు కూడా శిక్షణ ముగింపు దశలో ఉన్నది. మొదటి రెండు బ్యాచ్‌ల్లో డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందినవారిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇక్రిశాట్‌కు చెందిన అధికారులు కూడా ఉండటం విశేషం. పైలట్లకు శిక్షణ అందించడంలో టీఎస్‌ఏఏ ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది. తాము 12 ఏండ్లుగా వరుసగా అత్యుత్తమ విమాన శిక్షణ సంస్థ ఎంపికవుతున్నట్టుగా టీఎస్‌ఏఏ వర్గాలు తెలిపాయి. ఎవరైనా టీఎస్ఏఏలో చేరి శిక్షణపొందాలనుకొంటే https://droneacademy.telangana.gov.in/enroll/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మిగతా వివరాల కోసం info-droneacademy@ telangana.gov.in మెయిల్ చేయవచ్చు. లేదా 9783333978కు వాట్సాప్ చేసి వివరాలు
తెలుసుకోవచ్చు.