హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : భూభారతి భూముల మాయానికి హారతి పడుతుందని, భూమాత పోర్టల్.. భూమేతకు దారి తీస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రైతుకు రక్షణ కవచంగా ఉన్న ధరణి పోర్టల్ రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. భూభారతిని తిరోగమన చర్యగా ఆమె అభివర్ణించారు. భూభారతి బిల్లు శాసనమండలిలో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం చర్చలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత భూమోసాలు మాయమయ్యాయని, ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటే.. ‘భూ రక్షణ సమితి’ అని రైతులు, ప్రజలు అనుకున్నట్టు తెలిపారు. కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించే రైతుకు భూమిపై యాజమన్య హకు ఉండేలా చేశారని గుర్తుచేశారు. రైతులకు భూభద్రత కల్పించిందే కేసీఆర్ అని తెలిపారు. ధరణితో అనేక భూ సమస్యలు పరిషారమయ్యాయని, 35,749 మంది ఉద్యోగులు కేవలం 100 రోజుల్లోనే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేశారని కొనియాడారు.
ధరణితోనే సర్కారు భూములకు భద్రత..
ధరణి రాకముందు చార్మినార్‌ను కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ, ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడిందని కవిత స్పష్టంచేశారు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసిందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి చేయడంతో 42 నిమిషాల్లో పని పూర్తయ్యేదని గుర్తుచేశారు. భూ రికార్డులు సక్రమంగా ఉండడంతోనే రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయని స్పష్టంచేశారు. ధరణితోనే రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు అందించిందని తెలిపారు. గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావని, ధరణితోనే బ్యాంకులు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయని చెప్పారు. తద్వారా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి రైతులు విముక్తి పొందారని పేర్కొన్నారు.
భూభారతితో మళ్లీ పాత రోజులే..
రెవెన్యూ చట్టంలో 32 కాలాలతో పహాణీలు రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తద్వారా కేసులు, ఆర్థిక భారం పెరుగుతుందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఒకేసారి కాకుండా దశల వారీగా రీసర్వే చేపట్టాలని సూచించారు. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ భూధార్ కార్డు ఎందుకు తీసుకొస్తున్నట్టు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆబాదీ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందనే ప్రచారం జరుగుతున్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు. భూ వ్యవహారాల్లో తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదని సూచించారు.
సివిల్ రైట్స్ డేను విస్మరిస్తున్న ప్రభుత్వం
గ్రామాలు, పట్టణాల్లో కులవివక్ష, అంటరానితనం నిర్మూలనపై చైతన్యం కల్పించేందుకు ప్రతినెలా చివరి ఆదివారం సివిల్ రైట్స్‌డే పేరుతో జరిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శనివారం ఆమె శాసనమండలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎక్కడా సివిల్ రైట్స్ డే అమలుచేయలేదని పేర్కొన్నారు. ఏడాదిగా గ్రామాల్లో మహిళలపై నేరాలరేటు పెరుగుతున్నదని, దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడంతోపాటు సివిల్ రైట్స్ డేను అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపడుతామని సమాధానమిచ్చారు.