హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తేవాలని ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అయితే ఇప్పటికే రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ ఎందుకనేది? సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఎలా ఇవ్వనున్నది? గవర్నర్ అనుమతిస్తారా? ఆర్డినెన్స్ చెల్లుబాటవుతుందా? లేదా? అన్న అనేక ప్రశ్న లు వెల్లువెత్తుతున్నాయి. న్యాయకోవిదులు సైతం దీనిపై అనేక సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. సర్కారు మాత్రం ఆర్డినెన్స్ తెస్తామని పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నది. అందులో ఆంతర్యమేమిటన్నది రాజకీయవర్గాలు, బీసీ సంఘాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులగణన ఇంటింటి సర్వే చేసింది. ఆ గణాంకాలను డెడికేషన్ కమిషన్‌కు సమర్పించడంతోపాటు, బీసీల రిజర్వేషన్ స్థిరీకరణకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నది. వాటి ఆధారంగా గత మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో 2 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించింది. బిల్ నంబర్-3 ద్వారా విద్య, ఉపాధి రంగాల్లో, బిల్ నంబర్-4 ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతున్నట్టు చెప్పింది.
అసెంబ్లీ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి బిల్లులను పంపడంతోపాటు, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విన్నవించింది. వాటిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కాగా రాష్ర్టాల కులగణన చెల్లబోదని, ఆ గణాంకాలకు ఎలాంటి సాధికారత ఉండదని కేంద్రమే వెల్లడించింది. ఈ నేపథ్యంలో కులగణన ప్రాతిపాదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆ 2 బిల్లులు పూర్తిగా నిష్ప్రయోజనంగానే మారా యి. వాటి పూర్తిగా పక్కన పెట్టడం తప్ప మరేమీ లేదని న్యాయకోవిదులు సైతం వివరిస్తున్నారు.
అసెంబ్లీలో చేసిన బిల్లులు పాసయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉండగా, బీసీలకు లేవు. 73, 74 రాజ్యాంగ సవరణ, ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు ఉన్నది. దాని ప్రకారమే ఇప్పటివరకు అమలు చేస్తూ వస్తున్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2018 ద్వారా బీసీలకు తొలుత 34 శాతం రిజర్వేషన్ నిర్ణయించారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ను అది దాటిపోతున్నదని హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టు సైతం అప్పీల్‌కు అవకాశమివ్వలేదు.
ఈ నేపథ్యంలో చట్టాన్ని మరోసారి సవరించి బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్‌ను 22.79 శాతానికి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీలింగ్‌కు లోబడి ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68 శాతం, బీసీలకు 22.79 శాతం కలిపి 49.50 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు తెలంగాణ పంచాయతీ రాజ్ -2018 చట్టాన్ని మరోసారి సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. 50 శాతం సీలింగ్‌కు సంబంధించి న్యాయవివాదాలు లేకుండా ఉండేలా చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ 42 శాతం పెంచుతున్నట్టుగా ఆర్డినెన్స్‌లో పేర్కొనకుండా కేవలం గతంలో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సీలింగ్‌ను సడలిస్తూ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనిద్వారా ఎదురయ్యే న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉంటాయా? అనేదానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రభు త్వ పెద్దలు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం-2018ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడంతోపాటు, ఏకకాలంలోనే ఆర్డినెన్స్ అమలు చేస్తూ జీవో, మరోవైపు దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నదని తెలుస్తున్నది. కోర్టుకెళ్లే సమ యం ఎవరికీ ఇవ్వకుండానే ఎన్నికల ప్రక్రియ ను ముగించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. అవసరమైతే కేవియట్ దా ఖలు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఎవరైనా కోర్టుకు వెళ్లినా, విచారణను జాప్యం చేసే అవకాశం లభిస్తుంది. ఆ గడువులో ఎన్నికల ప్రక్రియ ముగించాలనేది సర్కా రు ఎత్తుగడని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ద్వారా ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే, ఆ తర్వాత సదరు ఆర్డినెన్స్ కోర్టులో నిలబడకపోయినా ఎన్నికల ప్రక్రియ రద్దయ్యే అవకాశం ఉండబోదనేది సర్కారు ఆలోచనగా తెలుస్తున్నది.
రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందరి దృష్టీ గవర్నర్‌పైనే ఉన్నది. శాసనసభ సమావేశాలు లేనప్పుడు, ప్రభు త్వం అత్యవసర విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. మంత్రి మండలి సూచన మేరకు ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీని ప్రోరోగ్ చేసింది. మరోవైపు నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను, ఆపై 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఆ మేరకు ఆర్డినెన్స్ జారీకి సర్కారు సిద్ధమవుతున్నది. గవర్నర్ ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది. రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డినెన్స్ జారీకి సూచనలు చేయాలని రాష్ట్రపతిని కోరుతారా? లేక జారీ చేయకుండా రిజర్వ్‌లో పెడతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్‌ను జారీ చేయకుండా రాష్ట్రపతికి పంపినా, రిజర్వ్‌లో పెట్టినా బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ మళ్లి మొదటికొచ్చే అవకాశమున్నది.