Runa Mafi | కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆగస్టులోపే అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని ఊదరగొట్టిన రేవంత్ సర్కారు..మూడు విడుతల్లో 45 నుంచి 55 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. మిగిలిన రైతులు పోరుబాట పట్టడంతో క్రాప్‌లోన్ ఫ్యామిలీ గ్రూపింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 4.25 లక్షల మంది రైతు కుటుంబాల గ్రూపింగ్ పూర్తి చేసిన అధికారులు ఆ వివరాలను ప్రభుత్వానికి అప్లోడ్ చేశారు. గ్రూపింగ్ పూర్తయినా వీరికి మాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. మరో 30 రకాల సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన రుణమాఫీకి సర్వే ఎప్పుడు చేయాలన్న అంశంపై ఇంకా ఆదేశాలు రాలేదు. రూ.2 లక్షలపైగా రుణం తీసుకున్నవారికి మాఫీ ఎలా చేయాలో అధికారులకు, బ్యాంకర్లకు నేటికీ స్పష్టతనివ్వలేదు. దీంతో రైతులు అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సర్కారు రోజుకో కొత్త విషయాన్ని తెరపైకి తెస్తూ .. రుణమాఫీ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.
రూ.2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీకి మొత్తం 22,37,848 ఖాతాల్లోకి రూ.17,933.19 కోట్ల నిధులను విడుదల చేసినట్టుగా ఆగస్టు 17న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తయినట్టుగానే మంత్రి చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ వర్తించని రైతులు భగ్గుమన్నారు. ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో సర్కారు దిగొచ్చింది. రుణమాఫీకాని రైతుల ఇండ్ల వద్దకు నేరుగా వ్యవసాయ అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తారని ప్రకటించింది. అంతలోనే మాట మార్చి రేషన్‌కార్డు సమస్యలతో రుణమాఫీకాని రైతులను సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య 4.25లక్షల కుటుంబాల్లో ఉన్నదని పేర్కొన్నది. జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులు రైతు కుటుంబాలను రైతు వేదికల వద్దకు పిలిపించి ప్రత్యేక యాప్‌లో క్రాప్‌లోన్ ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. 4.25 లక్షల కుటుంబాల గ్రూపింగ్ పూర్తయింది కాబట్టి.. సదరు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి. కానీ, ప్రభుత్వం ఈ విషయంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.
ఆధార్‌లో అచ్చుతప్పులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు లేక ఇబ్బందులు, ఆధార్‌కు, పట్టాదారు పాసుపుస్తకానికి అలాగే బ్యాంకులో ఉన్న ఖాతానంబర్, ఆధార్ నంబర్ మధ్య తేడా, ఇన్వాలిడ్ ఆధార్ నంబర్, నో డేటా ఫౌండ్, ఆధార్, రుణఖాతాల్లో వేర్వేరుగా ఉంటే ఆధార్ అప్లోడ్ చేయడం, ఆధార్ ఫ్యామిలీ గ్రూపింగ్ లేకపోవడం, పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం, ఆధార్‌తో బ్యాంకు లింకేజీ లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన వ్యవసాయశాఖ గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో రేషన్‌కార్డు సంబంధిత సమస్యలపై గ్రూపింగ్ పూర్తి చేసిన సర్కారు.. మిగిలిన సమస్యలతో రుణమాఫీ పొందని వారికి సంబంధించి ఎప్పటి నుంచి వివరాలు సేకరిస్తుంది..? ఏ ఫార్మెట్లో చేస్తుందన్న దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో సదరు రైతుల్లో అయోమయం నెలకొంది. అసలు.. మాఫీ చేస్తారా? చేయరా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
రుణమాఫీకి కట్టుబడి ఉన్నట్టుగా చెపుతున్న సర్కారు.. 31 ఆంశాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఒకేసారి సేకరించి.. అందులో అర్హులను నిర్ధారిస్తే సరిపోయేది. కానీ, ప్రభుత్వం దీనిని సాగదీస్తున్నది. ఆగస్టులోపు రూ.2 లక్షల పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని చెప్పిన సర్కారు… సర్వేలు, వివరాల సేకరణ పేరుతో కాలం దాటవేసే ప్రయత్నం చేస్తున్నది. ఒక్కో అంశం వారీగా సర్వేలు చేస్తే.. మరో ఏడాది పట్టినా.. రుణమాఫీ ప్రక్రియ పూర్తికాదన్న అభిప్రాయాలను అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి రుణమాఫీ చేయాలన్న లక్ష్యం ఉంటే.. వ్యవసాయశాఖాధికారులకు తోడు రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖలను అనుసంధానం చేసి.. వారం పది రోజుల్లో రుణమాఫీ కాని రైతుల పూర్తి వివరాలను సేకరించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న దాటవేత, నాన్చివేత ధోరణి వల్ల లక్షలాది మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
దమ్మపేట, సెప్టెంబర్ 29: రుణమాఫీకాని రైతుల అర్హతను ఫ్యామిలీ గ్రూపింగ్ ద్వారా తేల్చుతామని వ్యవసాయ అధికారులు ఇంటింటికీ వెళ్లి సెల్ఫీలు దిగి ఆ ఫొటోను, రైతుల వివరాలను ప్రభుత్వ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఆగస్టు 15 తరువాత మొదలైన ఈ ప్రక్రియ రెండు నెలలు కావస్తున్నా రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలాన్ని పరిశీలిస్తే.. మండలంలో సుమారు 11,300 మంది రైతులు రుణమాఫీకి అర్హులని ప్రభుత్వమే తేల్చింది. వీరిలో అనేక కారణాలు చెబుతూ సుమారు 3,300 మందికి రుణమాఫీకి దూరం చేసింది. రైతుల ఆందోళనల అనంతరం వారిలో 2,800 మంది రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా సుమారు 500 మంది రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్‌ను నిర్ధారించి సెల్ఫీలు దిగాల్సి ఉంది. దీంతో ‘సెల్ఫీలతోనే సరిపెట్టేస్తారా?’ అంటూ అర్హులైన రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘మా అర్హత తేల్చేదెన్నడు? రుణమాఫీ చేసేదెప్పుడు? అంటూ నిట్టూరుస్తున్నారు.
నాకు, నా భార్య రమకు కలిపి పంట రుణం 1.99 లక్షల రుణం ఉంది. రేషన్‌కార్డులేని కారణంగా రుణమాఫీ వర్తించలేదన్నరు. కుటుంబ సభ్యులతో ఫొటోదిగి ధ్రువీకరణ పత్రం ఇచ్చాం. ఇప్పటి వరకు.. అడుగు ముందుకు పడలే, ఎవరిని అడిగినా తెలియదంటున్నరు.
రామన్నపేట గ్రామీణ బ్యాంకులో లక్షన్నర రుణం తీసుకున్న. రేషన్ కా ర్డులేదని రుణమాఫీ కాలేదన్నరు. ఆగస్టు 29న ఫొటోలు దిగి.. పత్రాలపై సంతకాలు చేసి ఇచ్చినం. నెలరోజులైనా ఏ స్పందన లేదు.