హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్6 (నమస్తే తెలంగాణ): గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనుల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఇంజినీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా 2 ప్రాజెక్టులను చేపట్టింది. రాచకొండ రిజర్వాయర్‌లో కృష్ణాజలాలను, కేశవపూర్ రిజర్వాయర్‌లో గోదావరి జలాలను నిల్వ చేయాలని ప్రణాళికలను రూపొందించింది.
కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేట చెరువుకు, అక్కడి నుంచి ఔటర్ రోడ్డు వెంట ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు జలాలను తరలించి మూసీని పునరుజ్జీవం చేయాలని రూ.1100కోట్లతో కేసీఆర్ సర్కారు ప్రణాళికలను రూపొందించింది. అయితే భూసేకరణ ప్రతికూలంగా మారడంతో రాచకొండ రిజర్వాయర్ పనులను ఆదిలోనే పక్కన పెట్టారు. దానికి బదులుగా ప్రస్తుతం సాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి కృష్ణాజలాలను తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టును చేపట్టగా, ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇక గోదావరి జలాల తరలింపునకు సంబంధించి కేశవాపూర్ రిజర్వాయర్ పనులకు మాత్రం టెండర్లను పిలిచారు. ఆ పనులను మేఘా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకున్నది.
అంతే తప్ప తట్టెడు మట్టి పనికూడా చేపట్టలేదు. దీంతో మొత్తంగా ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టినట్టుగానే మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి ఫేజ్ 2 సీమ్‌ను మొత్తం మార్చింది. 1100 కోట్లతో పూర్తయ్యే కేశవాపూర్ రిజర్వాయర్ పనులను పక్కనపెట్టడమే కాకుండా, అందుకు విరుద్ధంగా 5600 కోట్లతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలను సరఫరా చేయడంతోపాటు, జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మొత్తంగా 15 టీఎంసీల పంపింగ్ ప్రాజెక్టుకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని కసరత్తు చేస్తున్నారు.