న్యూఢిల్లీ, జనవరి 5: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) కిందనున్న బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 5 పనిదినాలేనన్న డిమాండ్‌తో ఎంప్లాయీస్ ఈ స్ట్రైక్‌కు దిగుతున్నారు. దీంతో ఈ నెల ఆఖరి వారంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. 24 (నాల్గో శనివారం), 25 (ఆదివారం), 26 (రిపబ్లిక్ డే) తేదీల్లో బ్యాంకులకు రెగ్యులర్ హాలిడేస్ ఉన్నాయి మరి. సమ్మె జరిగితే బ్యాంకులకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ఇబ్బందేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఆదివారాలు కాకుండా ప్రతి నెలా రెండో, నాల్గో శనివారాలు బ్యాంకులు మూతబడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నెలలో వచ్చే ఆ మిగతా 2 లేదా 3 శనివారాలు కూడా బ్యాంకులకు సెలవుగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. నిజానికి 2024 మార్చిలో జరిగిన వేతన సవరణ సెటిల్మెంట్ సందర్భంగా శనివారాలు బ్యాంకులకు సెలవు దినంగా అమలుపర్చేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యూఎఫ్‌బీయూ రెండూ అంగీకరించాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాస్తా మూలనపడింది. అయితే శనివారాల్లో బ్యాంకులను మూసేస్తే వచ్చే నష్టమేమీ లేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. మిగతా రోజుల్లో (సోమవారం నుంచి శుక్రవారం వరకు) అదనంగా 40 నిమిషాలు ఎక్కువగా పనిచేసేందుకు ఉద్యోగులంతా సిద్ధమని ఓ ప్రకటనలో యూఎఫ్‌బీయూ చెప్తున్నది.
ఇప్పటికే ఆర్బీఐ, ఎల్ఐసీ, జీఐసీ మొదలగునవి వారానికి 5 రోజులే పనిచేస్తున్నాయని గుర్తుచేస్తున్నది. ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్, మనీ మార్కెట్, స్టాక్ ఎక్సేంజీల వంటి వాటికి కూడా శని, ఆదివారాల్లో సెలవేనని పేర్కొంటున్నది. ఇక చాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం శనివారాల్లో పనిచేయట్లేదని తెలిపింది. కాబట్టి వారానికి 5 రోజుల పనిదినాలను వద్దనేందుకు పెద్ద కారణమేమీ ఉండదని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. కాగా, #5DayBanking Now పేరిట ఉద్యోగ సంఘాలు చేపట్టిన సోషల్ మీడియా క్యాంపెయిన్‌కు 18,80, 027 లైక్‌లు వచ్చాయని, అలాగే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’పై దాదాపు 2,85,200 పోస్టులున్నాయాని యూఎఫ్‌బీయూ వెల్లడించింది.