High Court | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 5 (నమస్తే తెలంగాణ): హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ)కు చెందిన ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల పరిధిలోని భూములను కేటాయిస్తూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ భూములను న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టుకు నూతన భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల 14న ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గత నెల 23న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ శావిలి, జస్టిస్ టీ వినోద్‌కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనారెడ్డి కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
హైకోర్టు భవన నిర్మాణాలకు కేటాయించిన స్థలం విషయంలో పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభు త్వం కేటాయించిన బుద్వేల్, ప్రేమావతిపేటలోని స్థలం జీవ వైవిద్యానికి కేంద్రమని, భవనాల నిర్మాణంతో అది పూర్తిగా ధ్వంసమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాల పరిధిలో 1987లో ఒక పరిశోధనా ప్రాజెక్టుగా పురుడుపోసుకున్న ఆగ్రోఫారెస్ట్రీ, 2010లో అప్పటి సీఎం రోశయ్య చేతుల మీదగా ప్రా రంభమైన అగ్రిబయోడైవర్సిటీ పార్కులో 313 జాతులకు చెందిన 439 రకాలైన వృక్ష సంపద, 348 జాతులకు చెందిన అరుదైన జీవరాశులు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.
ఈ ప్రదేశం అంత జీవ వైవిధ్యభరితంగా, అంత సుందరంగా రాత్రికిరాత్రి తయారు కాలేదని, వాతావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులతో ఏ యేటికాయేడు సవాల్‌గా మారుతున్న వ్యవసాయా న్ని ముందుకు తీసుకుపోయి, రైతాంగాన్ని ఆదుకునేందుకు జరిగే పరిశోధనల కోసం దీనిని రూపొందించారని వివరిస్తున్నారు. అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, వేలాది మంది పరిశోధన విద్యార్థులు, కూలీలు రేయింబవళ్లు చెమటోడ్చి దానిని సృ ష్టించారని, అలాంటి గొప్ప ప్రదేశాన్ని ధ్వంసం చేస్తూ భవనాల నిర్మాణం చేపట్టడం సరికాదని హితవు చెప్తున్నారు. ఇలాంటి అరుదైన సంపదను కాపాడి, వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తుండటం బాధాకరమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టుకు నూతన భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన కేసీఆర్ ప్రభుత్వ హయాం నుంచే ఉన్నది. ఇందుకోసం బుద్వేల్‌లో 180 ఎకరాల స్థలాన్ని పరిశీలించి, కేటాయించేందుకు యోచించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని కాదని, వ్యవసాయ-ఉద్యానవన వర్సిటీల పరిధిలోని ఆగ్రో ఫారెస్ట్రీ డివిజన్, బయో డైవర్సిటీ పార్కు భూములను కేటాయించింది. ఆ భూములను న్యాయమూర్తులు, మంత్రులు పరిశీలించగా.. అదే సమయంలో ఈ ప్రాంత ప్రాముఖ్యాన్ని వివరిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అసోసియేషన్లుగా వినతిపత్రాలు ఇచ్చారు. సాధారణంగా ఇంతటి అరుదైన, వైవిధ్యమైన వృక్ష, జీవజాతులను చేజేతులా తుడిచిపెట్టేందుకు ఎవరూ సాహసించరు. కానీ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రియులను తీవ్రంగా కలిచివేశాయి.
బుద్వేల్, ప్రేమావతిపేట పరిధిలోనే వంద ఎకరాలను హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులివ్వడంతో అక్కడ ఉన్న ప్రకృతి సంపద తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అరుదైన జాతులకు చెందిన ప్రాణులు బుల్డోజర్ల కింద నలిగిపోతాయని, ప్రాణం దక్కించుకున్న జాతులు ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన చెందుతున్నారు. రైతాంగానికి మేలు చేసే పరిశోధనలకూ విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. మళ్లీ అలాంటి ప్రకృతి ఒడిని రూపొందించాలంటే మరికొన్ని దశాబ్దాలు పడుతుందని, భౌగోళికంగా, ప్రకృతిపరంగా అన్ని అనుకూలతలు ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్తున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలం విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.
రాజేంద్రనగర్‌లోని ఆగ్రోఫారెస్ట్రీ, అగ్రి బయోడైవర్సిటీ పార్కు అనేవి కేవలం భూములు కావు. అదో ప్రకృతి సంపద. ఎన్నో ఏండ్లు శ్రమిస్తే, ప్రకృతి సహకరిస్తే అది సాధ్యమైంది. లక్షలాది రైతులకు మేలు రకమైన విత్తనాలు, చీడపీడల నుంచి పంటను కాపాడుకునే విధానాలు అందించడంతోపాటు అనేక కోణాల్లో వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయే పరిశోధనలు అక్కడ జరుగుతున్నాయి. అందుకే ఆ ప్రాం తం ఒక లైవ్ ల్యాబరేటరీగా మారింది. సాధారణంగా బయటికి అది చూసేందుకు చెట్లతో కూడిన ప్రదేశంగా కనిపించవచ్చుగానీ… మనం దట్టమైన అడవుల్లోకి వెళ్తేగాని చూడలేని, కనిపించని వృక్ష, జీవజాతులు అందులో ఉన్నాయి. అవన్నీ వ్యవసాయ పరిశోధనలకు మూలంగా మారాయి. ఇలాంటి అమూల్యమైన సంపద అని మేం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకుండా అక్కడే నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయించడం పర్యావరణానికి ఉరి వేయడంలాంటిదే.
– డాక్టర్ వీ వాసుదేవరావు, రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్