హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. మరింత నష్టాలకు దిగజారుస్తున్నది. వర్షాలకు తడిసి రంగు మారిందనే సాకుతో సోయాబీన్, మక్కజొన్న, ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేయడం లేదు. దీనికి అధికారులు చెప్తున్న కారణం.. ఆ పంట కొనుగోలు చేస్తే నష్టం వస్తుందట. నిబంధనల ప్రకారం (ఎఫ్ఏక్యూ) ఉంటేనే కొనుగోలు చేస్తామంటూ తేల్చి చెప్తున్నారు.
ఇందులో భాగంగానే కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తమ పంటలను తెస్తే.. ఎఫ్ఏక్యూ ప్రకారం లేవంటూ నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపుతున్నారు. నష్టం వస్తుందని సర్కారే భావిస్తే.. ఇక రైతుల పరిస్థితి ఏం కావాలి. వారి నష్టాన్ని ఎవరు భరించాలి. లక్షలాది కోట్లతో రాష్ర్టాన్ని నడిపించే ప్రభుత్వం రైతుల కోసం పదుల కోట్ల నష్టాన్ని భరించలేనప్పుడు.. అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రైతులు ఆ నష్టాన్ని ఏ విధంగా భరిస్తారనే విషయాన్ని సర్కారు పెద్దలు ఆలోచించడమే లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం మానవీయ కోణాన్ని మరిచిందని రైతాంగ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
మొంథా తుఫాను, అంతకుముందు ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పత్తి, సోయాబీన్, ధాన్యం, మక్క పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నీళ్లలో మునిగిపోవడంతో పంట ఉత్పత్తులు రంగుమారాయి. తేమ శాతం ఎక్కువగా ఉంటున్నది. పలుచోట్ల పంటలు మొలకలు కూడా వచ్చాయి. అలాంటి పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మక్క, సాయాబీన్ను కొనడమే లేదు. పత్తిని సీసీఐ, ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోళ్లు చేయడమే లేదు. సోయాబీన్, మక్క, పత్తి రైతులు ఈ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోయాబీన్ రైతులపై మరింత ఎక్కువగా ఉంది.
ఎఫ్ఏక్యూ ప్రకారం ఉంటేనే కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ అధికారులు కరాఖండిగా సోయా పంటను నిరాకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు కాగా 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో కేంద్ర ప్రభుత్వం 75 వేల టన్నుల కొనుగోలుకు అనుమతిచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం 4,000 టన్నులే కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఏ కేంద్రంలో చూసినా సోయాబీన్ రంగుమారింది, నాణ్యత లేదంటూ కొర్రీలు పెడుతూ తిరస్కరిస్తున్నట్టుగా రైతులు మొత్తుకుంటున్నారు.
మక్కజొన్న అమ్మకాల్లో రైతులు అరిగోస పడుతున్నారు. రాష్ట్రంలో 17 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా, ఇప్పటి వరకు కేవలం 40 వేల టన్నులే కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇక్కడ కూడా మార్క్ఫెడ్ అధికారులు రంగు మారిందని, నాణ్యత లేదని కొర్రీలు పెడుతూ తిరస్కరిస్తున్నట్టుగా తెలిసింది. పత్తి విషయంలో సీసీఐ అధికారులు రైతులకు మరీ దారుణంగా చుక్కలు చూపిస్తున్నారు. అక్కడ కూడా రంగు మారిందని, తేమ 12 శాతం కన్నా అధికంగా ఉన్నదని, నాణ్యత సరిగ్గా లేదంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ కొర్రీలతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
తడిసి రంగుమారిన పంటలు కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి నష్టం వస్తుందట.. వాటి కొనుగోలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవట.. ఈ తీరుపై సర్కారుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రభుత్వమా? లేక ప్రైవేటు వ్యాపార కంపెనీయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులు నష్టపోకుండా వారికి అండగా నిలిచి వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. కానీ ఇక్కడి కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో కేంద్రంపై భారంమోపిన రాష్ట్ర సర్కారు.. రైతులకు అన్యాయం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోయా, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లలో కేంద్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నదన్న విమర్శలున్నాయి. రైతుల కోసం నష్టమైనా భరించి తాము కొనుగోలు చేస్తామనే భరోసా రాష్ట్ర సర్కారు నుంచి అన్నదాతలకు దక్కడమే లేదు. రైతుల విషయంలోనూ లాభనష్టాలను ఆలోచిస్తారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ సర్కారు రైతుల కోసం పదుల కోట్లు ఖర్చు చేసి రంగుమారిన పంటలు కొనుగోలు చేయలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రంగుమారిన పంటలను సర్కారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రకృతి నష్టం కలిగిస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కొనుగోలు చేయకపోతే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు. రంగుమారిందంటూ ప్రైవేటు వ్యాపారులు ఎలాగూ కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకుంటే ఆ పంటలను ఏం చేయాలి? ఎక్కడ అమ్ముకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఉండి ఎందుకని నిలదీస్తున్నారు. ప్రకృతి చేసిన నష్టానికి తాము బలికావాల్సిందేనా? అంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా కొర్రీలు పెట్టకుండా రంగుమారిన పంటలను కొనుగోలు చేయాలని రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది.