హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్వోలను ఇతర శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉండగా ఆ శాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త శాఖల్లో పునర్నియమించే అధికారం సైతం కలెక్టర్లకు కల్పించింది. ఇప్పటికే జిల్లాల వారీగా వీఆర్వోల జాబితా, ఇతర శాఖల్లోని ఖాళీల సంఖ్యతో సమగ్ర నివేదికలు తయారు చేశారు.
వాటి ఆధారంగా సర్దుబాటు జరగాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం గతంలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేవలం వ్యవస్థనే రద్దు చేస్తున్నామని, వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తామని అప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఇది అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 6,874 వీఆర్వో పోస్టులు ఉన్నాయి. 5,385 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరంతా ఇతర శాఖల్లోకి బదిలీ కానున్నారు. కొత్తగా కేటాయించే పోస్టులు జిల్లా, మండల, ఉప మండల కార్యాలయాల్లో ఉంటాయి.