నీలగిరి, సెప్టెంబర్ 15 : సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆమె తన పూర్వ పార్టీ భావజాలాన్నే ఇంకా అనుసరిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటో తెలియనివారు కూడా సెప్టెంబర్ 17 గురించి ఏదేదో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.
కొంతమంది బాధ్యత లేకుండా విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడటం దౌర్భాగ్యమన్నారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్ తమిళిసై తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై రుద్దడం సరికాదని సూచించారు. ఆమె గతంలో పనిచేసిన పార్టీ విధానాలకు అనుగుణంగానే.. ఆ భావజాలాన్నే అనుసరిస్తున్నారని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలతో గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని పోగొట్టొద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టడం సరికాదన్నారు.
వాళ్లకు, సెప్టెంబర్ 17కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు.. రాష్ర్ట ప్రభుత్వాల హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగేలా కేంద్రం పని చేస్తున్నదని దుయ్యబట్టారు. హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తయి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గుత్తా సుఖేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.