హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి, బీజేపీ హైకమాండ్ అవకాశమిస్తే చూద్దామంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో గవర్నర్‌కి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నట్టు వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గవర్నర్ తమిళి సై తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది.
ఈ మేరకు ఆమె బీజేపీ పెద్దలను కలిసి తన ఆసక్తిని వ్యక్తం చేసినట్టు అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. తాజాగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఆమెను ఎంపీగా బరిలో నిలిపేందుకు బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర గవర్నర్‌గా రాకముందు తమిళిసై సౌందర్‌రాజన్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.