హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఆర్థిక స్వేచ్ఛతోనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, మహిళా సాధికారత సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వీ హబ్‌ను సోమవారం గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో వీ హబ్ ముఖ్య భూమిక పోషిస్తున్నదని కొనియాడారు. మహిళలకు సుస్థిర భవిష్యత్తును అందించేందుకు వీ హబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఆర్థిక ప్రగతిలో మహిళా పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు కావాలని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. టైర్-2, టైర్-3 నగరాలను ప్రోత్సహించేలా వీ హబ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, దేశంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే వేదిక వీ హబ్ ఒకటేనని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకూ సేవలందించేందుకు వీ హబ్ సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వీ హబ్ సీఈవో సీతా పల్లచొల్లా, మహిళా ఆంత్రప్రెన్యూర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు స్టార్టప్ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించారు.