హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘పోషకాహారం, పశుసంపద అభివృద్ధికి పశువైద్య విద్య పట్టభద్రులు పాటుపడాలి. పాడిపరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి’ అని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023-24లో ఉత్తీర్ణ సాధించిన 16 మంది పీహెచ్డీ పట్టభద్రులు, 69 మంది మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, 439 మంది పశువైద్య విద్యార్థులరే పట్టాలు పంపిణీ చేశారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 18 మంది విద్యార్థులకు, ఇద్దరు ప్రొఫెసర్లకు బంగారు పతకాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. పశువైద్యులు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, ప్రజారోగ్యం, పర్యావరణం మధ్య వారధిగా నిలవాలని సూచించారు. జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు(ఎన్డీడీబీ), గుజరాత్ చైర్మన్ మనీశ్షా మాట్లాడుతూ.. వ్యవసాయం దేశ ఆర్థికవ్యస్థకు వెన్నెముకగా ఉండి జాతీయ జీడీపీకి 16శాతం తోడ్పాటు అందిస్తుండగా, వ్యవసాయ జీవీఏలో 31శాతం, దేశ జీవీఏలో 5.5శాతం వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధిలో సవాళ్లను స్వీకరించి ఈ రంగంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ జ్ఞానప్రకాశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శరత్చంద్ర, ఉదయ్ కుమార్, కిషన్‌కుమార్, జయలక్ష్మి, సతీశ్‌కుమార్, ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.