BC Reservations | హైదరాబాద్, జులై 15(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంపునకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు న్యాయశాఖ పంపింది. రిజర్వేషన్లు పెంచేలా పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(ఏ)ను సవరిస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ సెక్షన్ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దనే నిబంధన ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను సవరిస్తూ 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగించాలని కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకై ఆర్డినెన్స్ ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర మంత్రిమండలిలో నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను సడలిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను.. ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ తిరస్కరించడమో లేక అభ్యంతరాలు వ్యక్తంచేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. వేరే ప్రాంతంలో ఉన్న రాష్ట్ర గవర్నర్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు చేరుకుంటారని తెలిసింది. ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌పై బుధవారం అధికారులతో చర్చిస్తారని సమాచారం. ఒకవేళ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే ప్రభుత్వం జీవో ఇచ్చి రిజర్వేషన్లను పెంచనున్నది. ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటీ, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై చర్చ జరుగుతున్నది.