మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 16 : పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ ఉన్నత విద్యారంగంలో అగ్రగామిగా నిలవాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొని ఎదిగేలా, దేశం గర్వించేలా జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పీయూలో గురువారం నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌గా గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం ఉషా పథకం కింద రాష్ట్రంలోనే రూ.100 కోట్లు పొందిన విశ్వవిద్యాలయం పీయూ కావడం అభినందనీయమని అన్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే జాతీయ ప్రచారాన్ని తెలంగాణలో ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరారు. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ఎండీ మన్నె సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డగా యూనివర్సిటీ అభివృద్ధిలో కీలకభూమిక పోషిస్తానని హామీ ఇచ్చారు. వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ రూ.5 కోట్ల విలువైన పరిశోధన ప్రాజెక్టులు పూర్తి చేశారని, ప్రస్తుతం రూ.1.2 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు తెలిపారు.
83 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం..
ఈ సందర్భంగా 12 మందికి పీహెచ్డీ అవార్డులు, 83 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ అందజేశారు. మాజీ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, క్రీడల ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్వోడీలు పాల్గొన్నారు.