మేడ్చల్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ మనుచౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆమె రాష్ట్రపతి నిలయానికి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, రాధికాగుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 20, 21న భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నగరంలో పర్యటించనున్నారు. 20న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అకడి నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అకడ నుంచి లోక్‌భవన్‌లో రాత్రి బస చేస్తారు. 21న కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొని అకడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఢిల్లీకి తిరిగి వెళ్తారు. కాగా, ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కే రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.