హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిషరణలకు, స్థిరమైన అభివృద్ధికి హార్టికల్చర్ విద్యార్థులు రాయబారులుగా ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, పంటకోత తర్వాత సంభవించే నష్టాలు, మారెట్ అస్థిరత లాంటి ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు కట్టుదిట్టమైన విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన భాగస్వామ్యాలు అవసరమని ఉద్ఘాటించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంగళవారం శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ నాలుగో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఏటా 353 మిలియన్ టన్నులకుపైగా ఉద్యాన ఉత్పత్తులతో మన దేశం ప్రపంచానికి సారథ్యం వహిస్తున్నదని, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. భారత ఉద్యాన కేంద్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉద్యాన పంటలు 12.94 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయని, తద్వారా ఏటా 61.64 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తున్నదని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు అమెరికాలోని అలబామాలోని ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ అభ్యసించేందుకు ఓవర్సీస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విశ్వవిద్యాలయాన్ని, ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ.. సమ్మిళిత వృద్ధి, రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చడమే మన ప్రాధాన్యతలుగా ఉండాలని పేర్కొన్నా రు. వ్యవసాయ ఖర్చులు, పంటకోత తర్వాత నష్టాలను తగ్గించేందుకు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించేందుకు నూతన సాంకేతిక ఆవిషరణలు దోహదపడుతున్నాయని తెలిపారు. ఉద్యాన వర్సిటీ పురోగతిపై వైస్‌చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి నివేదికను సమర్పించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గవర్నర్, ఇతర అతిథులు బంగాలు పతకాలను ప్రదానం చేశారు.
విద్యార్థులకు బంగారు పతకాలు
హార్టికల్చర్ బీఎస్సీ (ఆనర్స్)లో హైదరాబాద్ అశోక్‌నగర్‌కు చెందిన గుడిసె చైతన్య 4 బంగారు పతకాలను కైవసం చేసుకోగా.. ఎమ్మెస్సీలో ఏ మోనిక నాగిని రెండు బంగారు పతకాలు సాధించారు. స్నాతకోత్సవంలో వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్య, వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ జ్ఞానప్రకాశ్, ఐఐవోఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథుర్, వర్సిటీ అధికారులు డాక్టర్ ఏ భగవాన్, డాక్టర్ జే చీనా, సురేశ్, శ్రీనివాసన్, పిడిగం సైదయ్య, ప్రశాంత్, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.