హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): బీసీల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ మేరకు విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు సరైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీసీ వర్గాలను సామాజికంగా బలోపేత చేయడానికి నిబద్ధతతో పనిచేయాలని కోరారు. బీసీలకు సంక్షేమ ఫలాలను అందించడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ పనితీరు, గురుకుల విద్యాలయాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, ఆత్మగౌరవ భవనాలు, ఫెడరేషన్లకు సంబంధించిన అనేక అంశాలపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, అడిషనల్ సెక్రటరీ పద్మ, ఎంబీసీ సీఈవో అలోక్‌కుమార్, మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు, చంద్రశేఖర్, సంధ్య, విమల, శ్రీనివాస్‌రెడ్డి, మద్దిలేటి, మంజుల, ఉదయ్ ప్రకాశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.