హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఇల్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యాపార వస్తువు. పిల్లర్లు, సిమెంట్, ఇటుకలతో చేసిన ఓ నిర్మాణం మాత్రమే. కానీ ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారికి అది విడదీయలేని మధుర జ్ఞాపకాల కేంద్రం. ఇలాంటి సెంటిమెంట్ల ముందు ఎలాంటి వ్యూహాలు.. ఎన్ని రకాల ప్రలోభాలైనా పని చేయవని మరోసారి తేటతెల్లం అయ్యింది. అది చూసి ప్రభుత్వం తెల్లబోయింది. మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైదర్షా కోట్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను సేకరించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అపార్ట్‌మెంట్‌వాసులు ఎదురుతిరగడంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. నోటిఫికేషన్ ఇచ్చి బెదిరించినా, జీరోవాల్యూ అంటూ అవమానించినా వారు పట్టు విడవడం లేదు. ఈ నేపథ్యంలో పాలకులు కొత్త వ్యూహాలు అమలు చేయగా, అవి కూడా బెడిసికొట్టాయి. విలువ కట్టలేని తమ గూడును కాపాడుకునేందుకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
పూర్తి ఫలితం ఇవ్వని ‘భేదం’
గాంధీ సరోవర్ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం మధు పార్కు రిడ్జ్ అపార్టుమెంట్వాసులపై సామ, దాన, భేద, దండోపాయాలను వరుసగా ప్రయోగిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఏడెకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అపార్ట్‌మెంట్‌వాసులు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో మొదట్లో చర్చలు అంటూ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం ఇవ్వలేదు. దీంతో కొత్త మార్గాలు ఎంచుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తెర ముందు కాకుండా తెర వెనుక ప్రణాళికను అమలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్తున్నారు. ముందుగా రెండు బ్లాకులుగా ఉన్న అపార్ట్‌మెంట్‌వాసుల్లో చీలిక తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరిని ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇలా వివిధ కోణాల్లో ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారని, ఫ్లాటును వదిలివెళ్లేందుకు ఒప్పించాలని ప్రయత్నించారని అంటున్నారు. మరికొందరిపై మరో మార్గంలో ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఈ క్రమంలో కొందరు ప్రాథమికంగా అంగీకరించి ఆందోళనలకు దూరంగా ఉన్నారని, అయినా అత్యధిక శాతం మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపార్టుమెంట్‌ను వీడేందుకు ఒప్పుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు.
పనిచేయని ‘దాన’ ప్రలోభాలు
ప్రభుత్వం భూసేకరణ చేపడితే బాధితులకు గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ అందుకు భిన్నమైన వైఖరి ఎంచుకున్నదని సచివాలయ వర్గాలు తెలిపాయి. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌వాసులకు ఫ్లాటుకు ఫ్లాటు లేదా బహిరంగ మార్కెట్లో పలికే ధరను సైతం ఇచ్చేందుకు సిద్ధమని సమాచారం అందించారట. కొన్నిరోజుల కిందట రాజేంద్రనగర్ ఆర్డీవో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ సమయంలోనూ అనధికారికంగా లీకులు ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఇదో బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం చేయించారు. అంతేకాదు కిస్మత్పూర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ నిర్మాణ సంస్థకు చెందిన పదకొండు నిర్మాణ ప్రాజెక్టులను కొందరు అధికారులు పరిశీలించారని తెలిసింది.
ఎవరికి నచ్చిన చోట వాళ్లు ఫ్లాట్ తీసుకోవచ్చని అపార్ట్మెంట్ వాసులకు ఆఫర్ ఇచ్చారట. అయినా అపార్ట్‌మెంట్‌వాసులు చాలామంది ఇందుకు అంగీకరించలేదు. దీంతో మరో అడుగు ముందుకేసి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌వాసులకు ఫ్లాటుకు ఫ్లాటుగానీ అంగీకరిస్తే మరోచోట ఏడెకరాల్లో అదేస్థాయిలో అపార్ట్‌మెంట్‌ను నిర్మించి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిబంధనల మేరకు అధికారికంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తే మిగిలిన చోట్ల బాధితులకు కూడా భూమికి భూమి, నిర్మాణానికి నిర్మాణం ఇవ్వాల్సి ఉంటుందని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట. అయినా ముందు ఈ అడ్డంకిని తొలగించుకోవాలనే ప్రణాళికలో భాగంగా ప్రలోభాల పర్వాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం. కానీ అపార్ట్‌మెంట్‌వాసుల సెంటిమెంట్ ముందు ఇవేవీ పని చేయలేదని అధికారులు చెప్తున్నారు. సోమవారం పలువురు జర్నలిస్టులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలో ఇదే అంశంపై మాట్లాడుతూ తాను ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అపార్ట్‌మెంట్‌వాసులు వినలేదని, ముందు కొందరు అంగీకరించి ఆపై మాట మార్చడంతో తమ వ్యూహం బెడిసికొట్టిందని చెప్పినట్టు సమాచారం.
అక్కసుతోనే ‘జీరో వాల్యూ’ విషం
సామ, దాన, భేద వ్యూహాలు అమలుచేసినా బెడిసికొట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి తన ఎత్తుగడ మార్చారని నిపుణులు చెప్తున్నారు. దండోపాయంవైపు యత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే కొన్నిరోజులుగా పలు సందర్భాల్లో మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ విషయంలో అక్కసు వెల్లగక్కుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆ అపార్ట్మెంట్ బఫర్‌జోన్‌లో ఉన్నదని, కాబట్టి దాని విలువ ‘జీరో’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ‘అపార్ట్మెంట్ సేకరించకపోయినా ప్రాజెక్టుకు వచ్చే నష్టం లేదు. కాకపోతే అపార్ట్మెంట్లో సగం బఫర్ జోన్లో ఉంది. భవిష్యత్తులో క్రయవిక్రయాలు జరగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి’ అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సామాన్యులు పైసాపైస కూడబెట్టుకొని కట్టుకున్న ఇంటికి విలువ లేదంటూ చులకన చేసి మాట్లాడటంపై అపార్ట్‌మెంట్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.