హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికా రం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నది. తగిన సంఖ్యలో బోధనా సిబ్బందిని నియమించడం విస్మరించింది. మౌలిక వసతులను ఏర్పాటుచేయడంలో అలసత్వం వహిస్తున్నది. ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ సరిపోయేంత లేకపోవడంతో వైద్య విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గాంధీలాంటి పెద్ద మెడికల్ కాలేజీల్లో సైతం రేడియాలజీ, మైక్రోబయాలజీలకు ఒక్కొక్కరు చొప్పున మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారంటే రాష్ట్రంలో వైద్య విద్య పట్ల కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
1300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో ఒక్కో దానిలో 250 సీట్లు ఉన్నాయి. మిగతా కాలేజీల్లో 50 నుంచి 175 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కాలేజీల్లో మొత్తం 1300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా వారికి ఈ ఏడాది ఇప్పటివరకు జీతాలు ఇవ్వనట్టు తెలిసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టకపోవడంతో ఇతర సిబ్బందిపై ఆ ప్రభావం పడుతున్నది. నిరుడు పూర్తి బోధనా సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో ఇది అమలుకు నోచుకోలేదు.
ఎన్ఎంసీ మొట్టికాయలు
ఇటీవల జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ప్రభుత్వ వైద్య కళాశాలలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం 10 మానిటరింగ్ కమిటీలను వేసింది. ఈ కమిటీలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పర్యటిస్తూ.. విద్యార్థుల వసతి గృహాల్లో భద్రత, శానిటేషన్, భోజన నాణ్యత, యాంటీ ర్యాగింగ్ టీమ్‌ల పనితీరు, మందుల సరఫరా, ఇన్ఫెక్షన్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలపై తనిఖీలు చేపడుతున్నాయి. జాతీ య వైద్య మండలి మొట్టికాయలు వేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మౌలిక వసతులపై దృష్టి సారించకపోవడంపై పలువురు వైద్యరంగ నిపుణులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్కారు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
607 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీజీఎంహెచ్‌ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్రెడ్డిని తెలిపారు. మరో 700 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు.