- రాష్ట్రమంతటా లక్షల మంది రైతుల ఎదురుచూపులు
- ఇస్తరా.. ఇవ్వరా..? స్పష్టతనివ్వని అధికారులు
- ఇదే అదనుగా చేతులెత్తేస్తున్న విత్తన కంపెనీలు
- రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్న అన్నదాతల పరిస్థితి
Bonus | కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సన్నరకం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు ఆ విషయాన్ని మరచిపోయింది. ప్రస్తుత యాసంగి సీజన్లో గత రెండునెలలుగా కొనుగోళ్లు జరుగుతున్నా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా సన్నాలకు బోనస్ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది. వానకాలం పంటలు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైన తరుణంలో బోనస్ డబ్బుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇవ్వడం లేదు కాబట్టి.. తాము అదనపు రేటు ఇవ్వబోమంటూ సీడ్ కంపెనీదారులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బోనస్ ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎప్పుడిస్తారన్న దానిపై అధికారులు, ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బోనస్ రూపంలో రైతులకు రూ.87.65 కోట్ల బోనస్ రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
ఏదీ బోనస్..?
ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు సన్నాలకు బోనస్ ఇవ్వని ప్రభుత్వం గత వానకాలంలో కూడా మూడు నెలల తర్వాత జమచేసింది. అప్పట్లో రైతులు ఆందోళనకు దిగితే తప్ప బోనస్ జమచేయలేదు. ఇంకా కొంతమందికి అప్పటి బోనస్ బకాయిలున్నాయని తెలిసింది. ఈ యాసంగి సీజన్లోనైనా విక్రయించిన సన్నాలకు, ఐదు, పది రోజుల్లోనే బోనస్ వస్తుందని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు ఈసారి కూడా నెరవేరడం లేదు. రాష్ట్ర ఖజానా అంతంత మాత్రంగానే ఉందని, పదేపదే సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న నేపథ్యంలో సన్నాలకు బోనస్ వస్తుందా? లేదా? అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కిన విషయం తెలిసిందే. కానీ సన్న రకం ధాన్యానికి మాత్రమే బోనస్ వర్తిస్తుందని చెప్పి, అదైనా క్రమంగా ఇవ్వడం లేదు. దొడ్డు రకం ధాన్యంతో కలిపి సన్న రకాలను కొనుగోలు చేస్తున్న సర్కారు, కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,320 చెల్లించి, బోనస్‌ను మాత్రం పెండింగ్‌లో పెడుతున్నది.
కరీంనగర్ జిల్లాలో 87.65 కోట్ల బకాయి
రాష్ట్రవ్యాప్తంగా బోనస్ కోసం లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రూ.87.65 కోట్ల బోనస్ రైతులకు రావాల్సి ఉంది. ఈ సీజన్లో కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 31,612 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోళ్లు జరుగగా, వీటికి ప్రతి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.15.81 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు సర్కారు బోనస్ ఇవ్వడం లేదు కాబట్టి సీడ్స్ కంపెనీలు సైతం క్వింటాలుకు రూ.2,500 మాత్రమే చెల్లిస్తామంటూ కొర్రీలు వేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఇటీవల ఇదే విషయమై వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం బోనస్ ఇస్తే తాము కూడా మిగిలిన డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.