హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తేతెలంగాణ): జువైనల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డుల చైర్పర్సన్, సభ్యుల నియామకాలపై సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. ఇప్పటికే రెండు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహణలో జాప్యం చేస్తుండడం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తమవుతున్నది.
రెండు సార్లు నోటిఫికేషన్లు.. తప్పని ఎదురుచూపులు
ఇప్పటివరకు జేజేబీలు ఉమ్మడి జిల్లాలు, డీసీడబ్ల్యూసీలు కొత్త జిల్లాల ఆధారంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొత్త జిల్లాల ప్ర కారం జేజే బోర్డులను విభజించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 36 (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో రెండు చొప్పున) జేజేబీలు, డీసీడబ్ల్యూసీలు ఏర్పాటు చేశారు. వీటిలో చైర్పర్సన్, నలుగురి చొప్పున సభ్యుల నియామకానికి మొదట జూలై 22 2025న నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు చేసుకొనేందుకు ఆగస్టు 8వరకు గడువు విధించింది. 35 ఏళ్లకు పైబడి 65 ఏళ్లలోపు వయస్సు కలిగి చైల్డ్ సైకాలజీ, లా, సోషల్‌వర్క్, హ్యూమన్ ఎడ్యుకేషన్, హ్యూమన్ హెల్త్, హ్యూమన్ డెవలప్మెంట్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తిచేసి, బాలలు, మహిళా శిశు సంక్షేమ, సామాజిక సేవలో ఏడేండ్లు పనిచేసినవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నది.
అయితే మరికొందరికి అవకాశం కల్పించేందుకు సెప్టెంబర్ 4న మరో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి అదే నెల 18ని తుది గడువు ప్రకటించింది. రెండు విడుతల్లో సుమారు వెయ్యి మందికి పైగా దరఖా స్తు చేసుకున్నారు. రెండో విడత నోటిఫికేషన్ గడువు ముగిసిన వారంలోనే పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు పరీక్ష ఊసేలేదు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ, ఆ వెంటనే రద్దు నేపథ్యంలో పరీక్ష మ రింత ఆలస్యమవుతుందోమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరీక్షపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
2024 ఫిబ్రవరిలోనే ముగిసిన పదవీకాలం
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ఆధారంగా జువైనల్ జస్టిస్ బోర్డులు, కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డులో చైర్పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారు. జేజేబీల బాధ్యులు నేరాలు చేసిన, కేసుల్లో నిందితులుగా ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు సహాయం చేస్తారు. డీసీడబ్ల్యూసీలోని బాధ్యులు 18 ఏళ్లలోపు అ నాథలు, తల్లిదండ్రుల్లేని పిల్లలకు ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అయితే వీరి పదవీకాలం 2024 ఫిబ్రవరి 4న ముగిసినా పాతవారితోనే నెట్టుకొస్తున్నారు.