తొర్రూరు, నవంబర్ 21 : మొంథా తుపాన్‌ను ఎదుర్కొని ఎలాగోలా అతికష్టం మీద పంట తీసిన అన్నదాతలు ఇప్పుడు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో యంత్రాంగం పెట్టే సవాలక్ష కొర్రీలను తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తుపాన్ కారణంగా తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం ప్రకటించినా, అది ఎక్కడా అమలు కావడం లేదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి కొందరు రైతులు తడిసి, నల్లబడిన ధాన్యాన్ని తీసుకొచ్చారు. అధికారులు మొదట కొనడానికి నిరాకరించడంతో ‘నమస్తే తెలంగాణ’లో ‘రంగుమారిందని కొనుగోళ్ల నిలిపివేత’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు రంగుమారిన ధాన్యాన్ని కొనడానికి కొన్ని షరతులతో ఒప్పుకొన్నారు. ఏ నష్టాన్నైనా తామే భరిస్తామని రైతులు ఒప్పంద పత్రం ఇస్తేనే కొంటామని షరతు పెట్టారు.
ఇందులో భాగంగా మాటేడు గ్రామ రైతులు జాటోత్ రాము 232 బస్తాలు, జాటోత్ వెంకన్న 229 బస్తాలు, జాటోత్ కేవుల 60 బస్తాలు, బొల్లం సునీల్ 150 బస్తాలు నలుపెక్కిన ధాన్యాన్ని కాంటా వేశారు. క్వింటాలు 5 కిలోల ధాన్యం కటింగ్ అవుతుందని, ఈ నష్టం పూర్తిగా రైతులే భరించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. ఈ షరతుకు ఒప్పుకొంటేనే కాంటా వేస్తామని పీఏసీఎస్ సిబ్బంది చెప్పినట్టు రైతులు వాపోయారు. ఈ మేరకు రైతులు పీఏసీఎస్ కార్యదర్శికి ఒప్పందం పత్రం రాసిచ్చారు. ఈ సందర్భంగా బాధిత రైతులు జాటోత్ వెంకన్న, జాటోత్ శ్రీలత మాట్లాడుతూ.. పంట పండించడానికి రూ.1.5 లక్షల అప్పు తెచ్చామని, ఇప్పుడు అమ్మిన ధాన్యానికి క్వింటాలు 5 కిలోల కటింగ్ చేస్తే తమకు ఏం మిగులుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నల్లబడిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించినా అధికారులు మాత్రం షరతులు పెట్టి తమను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 5 కిలోల కోతను నివారించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. ధాన్యం కాంటాలు వేయాలని చెప్పామని, ఒప్పంద పత్రం రాయించిన విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. అలా చేసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.