ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అధ్యక్షతన ‘పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ తొలి సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొని యునెస్కో విధించిన ఎనిమిది అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు నిచ్చే క్రమంలో యునెస్కో ఎనిమిది అంశాలలో షరతులతో కూడిన పనులు చేపట్టాలని సూచించిందన్నారు. అందులో మొదటి నిబంధన మేరకు రామప్ప దేవాలయానికి హద్దులు నిర్ణయించడంతోపాటు బఫర్ జోన్ నిర్ణయించాలని పేర్కొన్నట్లు ఆయన వివరించారు.
దీనికోసం పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేసి.. కలెక్టరేట్ లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అథారిటీ ఆధ్వర్యంలో హద్దులు నిర్ణయించి బఫర్ జోన్లను నిర్ణయించనున్నట్లు ఆయన తెలిపారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ద్వారా కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో పర్యటించి రామప్ప దేవాలయంతో పోలిన దేవాలయాలను గుర్తించి పరిశోధన నివేదిక సిద్ధం చేస్తున్నదని తెలిపారు. యునెస్కో నిబంధనల మేరకు రామప్ప దేవాలయ పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రామప్ప సరస్సు సైతం సంరక్షించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కాకతీయ వారసత్వ సంపద గురించి సిబ్బందికి సమాజానికి అవగాహన కల్పించేందుకు వర్కు షాపులను నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు ఇలా త్రిపాటి, వై వి గణేష్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్, పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు, కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.