BC Bandhu | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన పెండింగ్ నిధులను వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టడం ఇందుకు బలం చేకూర్చురుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా విడుదల చేయని కాంగ్రెస్ సర్కారు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న నిధులను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ తీరుపై బీసీ, కులవృత్తిదారురుల సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. పెండింగ్ నిధులను లబ్ధిదారులకే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీసీ బంధు పథకం ఆర్థిక సాయాన్ని అందించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక విడతలో అర్హుల ఎంపికగా దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,28,862 దరఖాస్తులు రాగా, అందులో మొత్తంగా 4.13 లక్షల మందిని రూ.1లక్ష ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తించింది. వారందరికీ ప్రతినెలా 15న ఆర్థిక సాయం అందించాలని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు 40వేల మంది కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సాయం అందించింది. ఇంకా 3.73లక్షల మంది అర్హులకు ఇవ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ బీసీ బంధు నిధులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడంతో పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
రాష్ట్రంలో బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తుల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. వృత్తిదారులు ముడిసరుకులు, యంత్ర పరికరాల కొనుగోలు చేసుకునేందుకు వీలుగా 100శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థికసాయం అందించింది. పథకం కోసం మొత్తంగా రూ.500కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.400 కోట్ల నిధులను కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ నిలిచిపోయింది. దాదాపు రూ.100కోట్ల నిధులు జిల్లా బీసీ సంక్షేమశాఖ వద్దనే పెండింగ్లో ఉన్నాయి. ఆ నిధులన్నీ కార్పొరేషన్ ఖాతాకు తిరిగి పంపించాలని కోరుతూ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు నిధులను వెనక్కి పంపారని తెలుస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): కార్మికుల సంక్షేమం, సంఘాల పరిరక్షణ కోసం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీతో కలిసి రావాలని మరో కార్మిక నేత అశ్వథ్థామరెడ్డిని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. ఆరు సంఘాలతో నాలుగు నెలల క్రితమే జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు.