హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్)తేల్చిచెబుతున్నది. ఇటీవల చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియలోని అనేక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయా అంశాలపై అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు అనుగుణంగా కోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ట్రిబ్ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామని చెబుతున్నది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.
అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్, పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ చర్యలు చేపట్టింది. గత ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించగా, ఈ ఫిబ్రవరిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులు మినహా 8,700 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిలిక్విష్మెంట్ లేకుండా నియామకాలు చేపట్టడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా కామన్ పేపర్ పెట్టి అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేయకుండా, ఆరోహణ పద్ధతిలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీచేయడం ద్వారా ఒక అభ్యర్థి 3 లేదా 4 ఉద్యోగాలకు ఎంపికయ్యారని, దాంతో 2వేల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడే పరిస్థితి నెలకొన్నదని కోర్టుకు విన్నవించారు.
పిటిషన్ స్వీకరించిన హైకోర్టు అభ్యర్థులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 6 నెలలు గడిచినా ట్రిబ్ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ట్రిబ్ మాత్రం.. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని చెప్తుండటంతో అభ్యర్థులు ఆందోలన చెందుతున్నారు. రిలిక్విష్మెంట్ అంశం ఒక్కటే గాకుండా ఇతర పోస్టులకు సంబంధించి కూడా ఇదే దుస్థితి నెలకొన్నది. ట్రిబ్ చేపట్టిన జేఎల్ బోటనీ పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్లో మైక్రోబయాలజీ అభ్యర్థులు అర్హులని ప్రకటించినా డెమోలకు అనుమతించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని, ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు, అర్హతలేని వారిని పోస్టులకు ఎంపిక చేశారని లైబ్రేరియన్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే జేఎల్ బోటనీ అభ్యర్థులకు హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులకు సంబంధించిన ఇంగ్లిష్‌లోనే కాకుండా తెలుగులోనూ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, ఆ వాదనలను సైతం కోర్టు సమర్థించింది. లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి కూడా హైకోర్టు ఇటీవలే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా, ట్రిబ్ ఇప్పటికీ ఆయా తీర్పులను అమలు చేయడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.