హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తాము ఎవరికీ భయపడమని, వర్గీకరణ ఆగే ప్రసక్తే లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు గురువారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగల సమష్టి కృషి, సమాజంలో అందరికీ సమాన హకులు కల్పించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతం, సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు.
గతేడాది ఆగస్టు 1న వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తుచేశారు. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా జ్యూడిషల్ కమిషన్ నియమించామని తెలిపారు. కమిషన్ పూర్తి శాస్త్రీయంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే నిర్ణయం తీసుకున్నామన్నారు.
అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు సుమారు 9.8 శాతం రిజర్వేషన్లు సాధించామని తెలిపారు. గ్రూప్-1లో 0.77 శాతం, గ్రూప్-2లో 9 శాతం మాదిగలకే దక్కిందన్నారు. వర్గీకరణ జరగడం ఇష్టంలేని వ్యక్తులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వాళ్లను ఎలా ఎదురోవాలో తమకు తెలుసన్నారు.