సుల్తానాబాద్, మే 19: కోడి పందాల మోజులో ఉద్యోగులు, వ్యాపారులు కటకటాలపాలైన ఘటన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో వెలుగుచూసింది. పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్‌రెడ్డి సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. శివపల్లిలోని బోడగుట్ట వద్ద కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు సుల్తానాబాద్, పెద్దపల్లి సీఐలు పొన్నమనేని రంజిత్‌రావు, కే ప్రవీణ్ సారథ్యంలో పోలీసులు దాడిచేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. పట్టుబడిన వారిలో ఓ మాజీ పోలీస్ సైతం ఉన్నట్టు తెలిపారు. కోడిపందాల ప్రధాన సూత్రధారి ఓ తాజా ప్రజాప్రతినిధి కొడుకు ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన దుగ్యాల కార్తీక్రావుగా గుర్తించారు.
అతడితోపాటు అదే గ్రామానికి చెందిన ఒజ్జ శంకర్, పొన్నాల రాజు, పెద్దపల్లికి చెందిన బత్తుల రాజు, మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన సల్లూరి పవన్, ఇందారానికి చెందిన గడ్డం రాజేశ్, గోదావరిఖనికి చెందిన పొట్లపల్లి మనోహర్, ఎండీ రహీం, ఇందారానికి చెందిన పెన్నా రవీందర్, వేల్పుల సతీశ్, పెద్దపల్లికి చెందిన పులి నాగరాజు, రామగిరికి చెందిన కొల్లూరి మహేశ్, జైపూర్ మండలం టేకుమట్లకు చెందిన ఎండీ సమాద్, పెద్దపల్లికి చెందిన సింగారపు అఖిల్ వర్మను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద 13 మొబైల్ ఫోన్స్, రూ.40 వేల నగదు, ఏడు బైకులు, ఒక ఎర్టిగా కారు, ఆరు కోళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న వైద్య శంకర్‌తోపాటు అదుపులో ఉన్న ఎండీ రహీం, వేల్పుల సతీశ్, పొన్నాల రాజుపై గతంలో వివిధ ఠాణాల్లో కోడి పందాల కేసులు ఉన్నాయని వివరించారు.