Pharma Villages | హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): ‘ఫార్మా విలేజ్ల కోసం 1100 ఎకరాలు సేకరిస్తుంటే మీకెందుకు కడుపుమంట?’ అంటూ వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అయితే, సీఎం చెప్తున్నదాంట్లో ఎంతమాత్రమూ నిజం లేదు. ‘సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తాం. ఒక్కో విలేజ్ 1000 నుంచి 2000 ఎకరాల్లో ఉంటుంది. ముందుగా వికారాబా ద్, మెదక్, నల్లగొండలో ఈ విలేజ్లు ఏర్పా టు చేస్తాం’.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బయోఏషియా-2024 సదస్సు సందర్భంగా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. దీనినిబట్టి చూస్తే ఫార్మా విలేజ్ల కోసం సేకరిస్తున్నది 1100 ఎకరాలు కాదని.. 10 వేల నుంచి 20 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందన్నది సుస్పష్టం. కానీ, బుధవారం వేములవాడ సభలో మాట్లాడుతూ 1100 ఎకరాలు మాత్ర మే సేకరిస్తున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశా రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. రాష్ట్రవ్యాప్తంగా 1000-2000 ఎకరాల్లో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదట వికారాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, అక్కడ భూములు అందుబాటులో లేవని కలెక్టర్లు తేల్చారు. అయినా సరే, వికారాబాద్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాల్సిందేనని సీఎం సంకల్పించారు. అందులో భాగంగానే లగచర్ల ఘటన చోటుచేసుకున్నది. భూసేకరణ వ్యవహారం ఒక్క లగచర్లకే పరిమితమవుతుందా? లేక రాష్ట్రవ్యాప్తంగా చేపడతారా అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తున్నది. ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా 10 ఫార్మావిలేజ్ల కోసం ప్రభుత్వ భూములు ఎక్కడా అందుబాటులో లేవు. అయినా సరే ప్రభుత్వం ముందుకెళ్తే రైతుల నుంచే భూసేకరణ చేయాల్సి వస్తుంది.
ఫార్మారంగంలో రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా నిలిపే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ని ముచ్చర్ల ప్రాంతంలో 14,029 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మొదటి దశలో 8,900 ఎకరాల్లో ఔష ధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్నిచోట్ల కోర్టు కేసుల వల్ల ఇది ముందుకు సాగలేదు. ముచ్చర్లలో సేకరించిన భూముల్లో 2 వేల ఎకరాల్లో ఇ ప్పుడు ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేసినా, మిగతా చోట్ల ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం సేకరించే భూములకు నష్టపరిహారం కింద కేవలం రిజిస్ట్రేషన్ ధరపై మూడు రెట్లు అధికంగా చెల్లిస్తారు. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ ధర ఎకరానికి రూ.2 లక్షలు ఉంటే ప్రభుత్వం చెల్లించేది 6లక్షలు మా త్ర మే. నేడు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాం తంలో కూడా భూముల ధర ఎకరానికి రూ. 10-20 లక్షలకు తక్కువలేదు. బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధరలతో పోల్చుకు ని రైతులు తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో సైతం భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు తిరగబడటంతో ముందుకు సాగడంలేదు. తాజాగా సీఎం ఫార్మాసిటీకి కేవలం 1100 ఎకరాలే సేకరిస్తున్నట్టు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 1100 ఎకరాలు ఇచ్చేందుకు కూడా రైతులు ముందుకు రావడంలేదు. ప్రభుత్వం ఇంతటి తో ఆగుతుందా? లేక రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా విలేజ్లు అంటూ ముందుకు సాగుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్తే రైతుల నుంచి తిరుగుబాటు తప్పదన్న చర్చ జరుగుతున్నది.