Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు.. కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ వంటి స్టేట్ యూనివర్సిటీలలో ప్రమాణాలు పడిపోయాయి. పట్టించుకునేనాథులు లేకపోవడం వల్ల ఆయా వర్సిటీలు విలవిల్లాడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు.
సరిపడా అధ్యాపకులు ఉన్నకాలంలో ఆయా యూనివర్సిటీలలో గరిష్టంగా 70 శాతం వరకు పరిశోధనలు జరిగేవి. పరిశోధనాపత్రాలు కూడా సకాలంలో దాఖలు చేసేవారు. ఇప్పుడు పరిశోధనలు 20 శాతానికి పడిపోయినట్టు సీనియర్ ప్రొఫెసర్లు చెప్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తంచేశారు. వర్సిటీలో బోధన కుంటుపడిందని సీనియర్ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కలిపి 2,816 పోస్టులు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 2,059 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్ పోస్టులతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.
యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టింట్ ప్రొఫెసర్ల భర్తీకి సాంకేతిక పరంగా ఎలాంటి సమ్యలు లేవు. వాటిని తక్షణమే భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ యూనివర్సిటీ వారీగా విడుదల చేసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పోస్టుల భర్తీ కోసం అనుమతిరావాల్సి ఉంది. అందుకోసం ఎదురుచూస్తున్నాం.
– ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, రాష్ట్రఉన్నత విద్యా మండలి ఛైర్మన్