హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : కాలేజీల్లో ప్రత్యక్ష తనిఖీలు చేసిన తర్వాతే ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు ఖరారుచేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ తనిఖీల కోసం యూనివర్సిటీ, కళాశాల విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నది. తనిఖీ నివేదికల ఆధారంగానే ఫీజులపై తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇదేకాకుండా కాలేజీల ఖర్చులు, ఆదాయాన్ని ఏటా ఆడిటింగ్ చేయనున్నది. ఆడిట్ చేసిన బ్యాలెన్స్షీట్లు, ఆదాయ వ్యయ నివేదికలను ఇప్పటి వరకు మూడేండ్లకోసారి పరిగణనలోకి తీసుకుంటుండగా, ఇక నుంచి ఏటా పరిగణనలోకి తీసుకోనున్నది. దీంతో కాలేజీలు ప్రతి ఏటా ఆడిటింగ్ నివేదికలను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి సమర్పించాలి. ఇలాంటి కొత్త మార్పులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కార్ శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటికే టీఏఎఫ్ఆర్సీకి ఆయా అంశాలపై ఆదేశాలివ్వగా, టీఏఎఫ్ఆర్సీ సైతం ఇందుకు అంగీకారం తెలిపింది.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లాలోని అటవీ ప్రాంతంలోని సలేశ్వరం దేవాలయానికి ప్రత్యేక అవసరం ఉన్న భక్తులను అగ్నిమాపక సిబ్బంది భుజాలపై మోసుకొని వెళ్లడం అభినందనీయమని ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ కొనియాడారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 1నుంచి 3 వరకు జాతర సందర్భంగా ఆలయానికి వేలాదిమంది భక్తులు వచ్చారని, వారికి తమ సిబ్బంది అవసరమైన సేవలు అందించారని తెలిపారు. అడవి మార్గాలు, సవాళ్లతో కూడిన ట్రెకింగ్ దారులు, మౌలిక సదుపాయాలు లేనిచోట భక్తుల భద్రతకు ఫైర్ సిబ్బంది అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం, సురక్షిత ట్రెకింగ్ గురించి భక్తులకు మార్గనిర్దేశం చేయడంతోపాటు గుంపులా వస్తున్న వారిని నియంత్రించి.. అందరికీ దర్శనభాగ్యం కలిగేలా చూశారని తెలిపారు.