ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని సంజయ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరుణ శనివారం తెల్లవారుజామున భవనం నుంచి పడి తీవ్రంగా గాయాలపాలయింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ప్రమాదవాశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు జైనథ్ మండలంలోని పెండల్వాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.