Telangana | కందుకూరు, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచులూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు. శనివారం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని ‘గోబ్యాక్’ అని నినాదాలు చేశారు. దీంతో ఆ గ్రామాల్లో రెండు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారుచౌకగా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అవే తమకు జీవనాధారమని, అవి కోల్పోతే బతికేదెలా అని అధికారులను నిలదీశారు.‘మా భూముల్లో మాకు తెలియకుండా సర్వే చేస్తారా? ఇదెక్కడి అన్యాయం. మీ రోడ్డు కోసం మా భూమి తీసుకోవడం ఏంటి? మా భూమికి ధర నిర్ణయించాల్సింది మేం, అంతేకానీ మీరెలా నిర్ణయిస్తారు? ఇంతే ఇస్తామని చెప్పడం ఏమిటి? అయినా, మాకు సమాచారం ఇవ్వకుండా సర్వేకు ఎలా వస్తారు? రోడ్డు కోసం భూమి ఇచ్చేదే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ అధికారులుపై రైతులు తిరగబడ్డారు. దీంతో లగచర్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెనక్కి తగ్గారు.
కందుకూరు మండల పరిధిలోని మీర్ఖాన్పేట, బేగరికంచె గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి రోడ్డు సర్వే పనులను అధికారులు చేపట్టారు. అందులో భాగంగా రోడ్డు వెళ్లే మార్గంలో సర్వేకు అధికారులు రంగంలోకి దిగారు. శనివారం కృష్ణయ్య, సాయికాంత్తో కూడిన సర్వే బృందం రాచులూరు, బేగంపేట గ్రామాలకు వెళ్లింది. రోడ్డు కోసం భూసేకరణ సర్వేకు సిద్ధమవగా విషయం తెలిసిన రైతులు దాదాపు వందమంది అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. తమ భూముల్లో సర్వేకు చేయడానికి మీరెవరని ప్రశ్నించారు.
తహసీల్దార్ గోపాల్, గ్రామపెద్ద, అర్జున అవార్డు గ్రహీత వెదిరె రవికాంత్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ససేమిరా అంటూ సర్వే చేయనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. రోడ్డుకు 300 అడుగులు అవసరమని చెప్పి 330 అడుగులు తీసుకుంటున్నారని, అంత రోడ్డు అవసరమా? అని ప్రశ్నించారు. తామంతా చిన్న, సన్నకారు రైతులమని, తమకున్న కొద్దిపాటి భూమిలో అంత రోడ్డుపోతే ఎలా బతకాలని నిలదీశారు. దీంతో చేసేది లేక వెనక్కి తగ్గిన తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల సమస్యలను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పి వెనుదిరిగారు.