హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనుకొనే పేద, మధ్యతరగతి బీసీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రూ.20 లక్షల వరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ విదేశీవిద్య కలను సాకారం చేస్తున్నది. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొంటున్న యువత చదువు పూర్తిచేసుకొని అక్కడే కొలువులు చేస్తూ బంగారుభవితకు బాటలు వేసుకొంటున్నారు.
ఏటా 300 మందికి అవకాశం..
రాష్ట్ర ప్రభుత్వం 2016లో మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ పథకాన్ని ప్రారంభించింది. యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో బీసీ యువకులు చదువుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఏటా రెండు విడతలలో 150 చొప్పున 300 మందికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తున్నది. కొంతమందికి ప్రయాణచార్జీలతోపాటు ఇతర ఖర్చులు కూడా ఇస్తున్నది.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఈ పథకం కింద 2020-21 సంవత్సరానికి ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జీమ్యాట్, టోఫెల్, జీఆర్ఈ, ఐలైట్స్ స్కోర్ సాధించి, కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్న అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. వివరాలకు https:// telanganaepass. cgg.gov. in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
ప్రభుత్వ సహకారం వల్లే..
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్. నాన్న కాశయ్య నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ నన్ను చదివించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించడం వల్లే జర్మనీలో ఎంఎస్ మెకట్రానిక్స్ పూర్తి చేసి, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నా. ప్రభుత్వం ఆర్థికసాయం చేయకుంటే నా కల సాకారమయ్యేది కాదు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ఉబ్బనపల్లి ప్రకాశ్, జర్మనీ