Cyber Crime | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఒకే ఏడాదిలో సుమారుగా రూ.2,000 కోట్లు దోచుకెళ్లారు. గుండెలు ఝల్లుమనే ఈ వార్త ఎక్కడిదో కాదు. అది మనదేశంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే.. అంత నగదును సైబర్ నేరగాళ్లు మన పౌరుల ఖాతాల నుంచి లూటీ చేశారు. ఏడాదిలోనే రూ.వేలాది కోట్లు పౌరుల సొమ్మును కొల్లగొడుతుంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. నిరుడు రూ.778 కోట్లను సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తే.. ఈ ఏడాది ఆ దోపిడీ రూ.1866.9 కోట్లకు రికార్డుల్లో నమోదైంది.
నిరుడి కంటే ఈ ఏడాది సుమారు రూ.1,088 కోట్లను అదనంగా దోచుకున్నారు. కేసులు నమోదు కాని ఘటనలు ఇంకా ఉండే అవకాశం ఉన్నది. ఇంత భారీ మొత్తంలో ఒక రాష్ట్రం నుంచి నగదును సైబర్ నేరగాళ్లు కొల్లగొడితే.. ప్రభుత్వం పౌరులకు అవగాహన కల్పించే బాధ్యతను మరిచి రాజకీయాలు చేస్తున్నదని పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది నమోదైన టాప్-5 సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్టిమెంట్, స్టాక్స్ మోసాలు అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పార్ట్‌టైమ్ జాబ్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ సర్వీసెస్, డెబిట్/క్రెడిట్ కార్డుల మోసాలు వరస క్రమంలో నిలిచాయి.
బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్ ఫ్రాడ్లలో అత్యధికంగా చదువుకున్న వారు, ఉన్నతస్థాయి ఉద్యోగులే రూ.వందల కోట్లను కోల్పోవడం గమనార్హం. బాధితుల్లో అత్యధికంగా 56 శాతం ప్రైవేట్ ఉద్యోగులు, 10 శాతం స్వయం ఉపాధి రంగం వారు, 9 శాతం విద్యార్థులు, వ్యాపారులు, 5 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సోషల్ మీడియాల్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనలకు దీటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆ స్థాయిలో నేరాలపై అవగాహన కల్పించే మార్గాలు లేకపోవడం అత్యంత బాధాకరం. నాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరోను నగదును ఫ్రీజ్ చేయించేందుకే ఉపయోగిస్తున్న ప్రభుత్వం.. అదనంగా సిబ్బందిని పెంచి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో మాత్రం విఫలమవుతుంది.
సైబర్ నేరాలు అత్యధికంగా ట్రై కమిషనరేట్ల పరిధిలోనే నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 25,112 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ నుంచి 20,299, రాచకొండ నుంచి 14,815 కేసులు నమోదయ్యాయి. వరంగల్ నుంచి 3,531 కేసులు, సంగారెడ్డి 3,132 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో (గంటలోపు) కాల్ చేయాలని చెబుతున్నా.. 1930కి కాల్ చేస్తుంటే నిత్యం బిజీ వస్తుందని బాధితులు ఒకవైపు వాపోతున్నారు. ఇక జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా చాలా మందికి ఫిర్యాదు చేసే విధానం తెలియకపోవడంతో పుణ్యకాలం గడిచిపోతుందని అంటున్నారు. పనితీరును మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నా ఏ మాత్రం ఫలితం లేకుండా పోతున్నది. ఈ ఏడాది 1057 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయగా, రూ.176.71 కోట్లను బాధితుల ఖాతాలకు బదిలీ చేయించారు. రూ.244.56 కోట్లను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్లకుండా నగదును స్తంభింపజేశారు.
పోలీస్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 2022లో సైబర్ నేరాల సంఖ్య 13,895. నిరుడు డిసెంబర్లో ప్రభుత్వం విడుదల చేసిన ‘పోలీస్ యాన్యువల్ రిపోర్ట్-2023’ ప్రకారం నమోదైంది 16,339. అదే నివేదికలో టీజీ సీఎస్బీ ద్వారా అందిన ఫిర్యాదులను 85,030గా చూపించారు. నిరుడు ఒకే బుక్‌లెట్‌లో విడుదల చేసిన సైబర్ నేరాలను కలిపితే మొత్తం 1,01,369 కేసులు అవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 23న సైబర్ సెక్యూరిటీ బ్యూరో విడుదల చేసి రిపోర్ట్‌లో 2023లో నమోదైన సైబర్ నేరాల సంఖ్యను 91,652గా చూపించారు. రూ.778.7 కోట్ల ను మోసగాళ్లు కొల్లగొట్టినట్టుగా పేర్కొన్నారు. 2023 నేరాలపై పోలీసులకే స్పష్టతే లేకపోయింది. పోలీసులే లెక్కలతో ప్రభుత్వాన్ని ఏమార్చే కుట్ర చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది 18 శాతం అదనంగా అంటే 1,14,174 సైబర్ నేరాలు నమోదయ్యాయని లెక్కతేల్చారు.