హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): గుండెపోటు వచ్చిన ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావును ‘గోల్డెన్ అవర్’లో ఓ ప్రముఖ దవాఖానకు తీసుకెళ్లినా.. వారు ‘పోలీసు ఆరోగ్య భద్రతా?’ అని ప్రశ్నించి.. ఇక్కడ కుదరదంటూ వెనక్కి పంపడం, సమయం మించిపోయి అతను చనిపోవడంతో రాష్ట్రంలో పోలీసుల ఆరోగ్య భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసినట్టు తెలుస్తున్నది.
పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఏ దవాఖానకు వెళ్లినా ‘పోలీసు ఆరోగ్య భద్రతా?.. దానిపై వైద్యం చేయలేమని ముఖానే చెప్తున్నారు. ప్రతినెలా తమ వేతనం నుంచి వైద్య అవసరాల కోసం రూ.200 నాన్ రిఫండ్ కింద కట్ చేస్తున్నా.. తమకు అందాల్సిన వైద్యం సకాలంలో అందకపోవడంపై పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత నుంచి దవాఖానలకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగులో ఉండడం వల్లనే దవాఖానలు పోలీసులకు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నాయని వారు వాపోతున్నారు.
పోలీసు ఆరోగ్య భద్రత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఏబీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు 14, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వంటి 150కి పైగా హాస్పిటల్స్‌లో పోలీసులకు ఆరోగ్య సేవలు అందాల్సి ఉంది. అయితే వీటిల్లో కొన్ని దవాఖానలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు విడుదల కాక.. ఆరోగ్య భద్రత కార్డు అంటేనే వైద్యం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావు విషయం ఒక్కటే బయటికి వచ్చిందని, ఎంతోమంది ఆ విషయాలు బయటికి చెప్పుకోలేక తమ వారిని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వదిలేయలేక అప్పోసొప్పో తెచ్చి వైద్యం చేయిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయని
పోలీసులకు అందించిన వైద్యానికి గాను దవాఖానలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రూ.వంద కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రతినెల మెడికల్ బెనిఫిట్ కోసం ఉద్యోగుల నుంచి వసూలు చేసే డబ్బులే రూ.1.5 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు తమ కుటుంబసభ్యులకు అందాల్సిన వైద్యం గురించి ప్రశ్నిస్తే.. పై అధికారులు అకారణంగా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని సిబ్బంది కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావు మృతి విషయంలో వ్యవస్థను ప్రశ్నించిన ఓ పోలీసును అకారణంగా అడవుల పాల్జేశారని, తన పేరు బయటికి చెప్పుకోలేని ఓ ఉద్యోగి కన్నీటి పర్యంతమయ్యాడు.
పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఎరియర్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, టీఏలు ఈ దసరాకైనా విడుదల చేయాలని పోలీసులు కోరుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేసుకొని బందోబస్తుకు వెళ్తే.. టీఏలు ఇవ్వని దుస్థితి ఉందని అంటున్నారు. కానిస్టేబుల్ నుంచి పైస్థాయి అధికారి వరకు సగటున ఒక్కొక్కరికి సుమారుగా రూ.3 లక్షల వరకు ప్రభుత్వం బాకీ ఉందని అంటున్నారు.