హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై(Heavy Rains) ఉన్నత స్థాయి సమీక్షను ( High level Review ) నిర్వహించి వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల, రాజకీయ ప్రచారాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజల ఇక్కట్లపై దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సహకారం తీసుకోవాలన్నారు. గతంలో వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్లను పంపించి ఆదుకున్నామని గుర్తు చేశారు. కామారెడ్డి ( Kamareddy ) జిల్లా నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న 10 మంది కార్మికులు, మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ తండాలోని గిరిజనులను కాపాడాలని కోరారు. రోడ్లు, రహదారులు, విద్యుత్ వంటి వసతుల మరమ్మతులపై దృష్టి సారించాని తెలిపారు.
గడిచిన 24 గంటల్లో భారీగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీటమునిగాయని, వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారులు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయని, అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నానరని పేర్కొన్నారు. కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు కూడా వారికి అందుబాటులో లేకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ , రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారి 44తో పాటు, అంతర్ జిల్లా రహదారులు కూడా రోడ్లు కొట్టుకుపోయి, జల ప్రవాహంతో స్తంభించి పోయి ఉన్నాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర క్యాబినెట్ స్పందించాలి..
ముఖ్యమంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్ అంతా భారీ వర్షాలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటి విపత్తులు సంభవించిన వెంటనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పెద్దఎత్తున రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలన్నారు.
వరదలో చిక్కుకున్న బాధితుల కోసం ప్రత్యేకంగా రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి, వారికి సురక్షితమైన ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయించాలన్నారు. . కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని, వైఫల్యం చెందితే, బీఆర్ఎస్ కార్యకర్తలు తమ వంతుగా ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.