హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిషారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిషారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని సూచించారు.