హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్యం పథకం నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా ఈ పథకం నిధులు విడుదలకాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకటో తేదీనే వేతనాలు ఆచరణకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీలు, అంగన్వాడీలు, గ్రంథాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రావడం లేదని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని 6,441 దేవాలయాల్లో దూప దీప నైవేద్యం పథకం అమలుచేసిందని గుర్తుచేశారు. అర్చకులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని, అనేకమందిని రెగ్యులరైజ్ చేసిందని తెలిపారు. మిగిలిన కొద్దిమందని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ధూప దీప నైవెద్యం కింద బ్రాహ్మణులు మాత్రమే లేరని, 26 ఉపకులాలకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఓవర్సీస్ సాలర్షిప్ కూడా రావడం లేదని, ఇప్పటికే 400 మందికి మంజూరైనా నిధులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు.