చౌటుప్పల్, మార్చి 11 : ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ వ్యాపారులు అడుక్కునే పరిస్థితి తెచ్చిందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ తెరపైకి తెచ్చి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలానే సాగితే రియల్ వ్యాపారులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. 2022కు ముందు జరిగిన డాక్యుమెంట్లకు ఎల్ఆర్ఎస్ లేకుండా చేయాలని, దీని తర్వాత జరిగిన లేఅవుట్లలోని డాక్యుమెంట్లకు ఈ నెలాఖరు కాకుండా డిసెంబర్ 31వరకు గడువు పెంచాలని కోరారు. ఎన్నో ఏండ్ల కింద రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ కట్టాలని సబ్‌రిజిస్ట్రార్ చెపుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల అధ్యక్షుడు పేరెపల్లి స్వామి గౌడ్, ప్రధానకార్యదర్శి కేతరాజు శంకర్, నాయకులు అనంతుల నర్సింహ గౌడ్, ఎండీ చాంద్‌పాషా, కొయ్యడ గాలయ్యగౌడ్, నోముల రాజశేఖర్ రెడ్డి, బొమ్మకంటి గోపాల్, గోసుల సోమయ్య, దంటిక అంజయ్య, ఎండీ రషీద్, సుక్క శ్రీశైలం, బద్దుల సుధాకర్ పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి
ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ విధానాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలి. ఈ విధానం నిరుపేదలకు భారంగా మారింది. ఎన్నో ఏండ్ల కింద కొన్న ప్లాట్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం సరైందికాదు. నిరుపేదలు వేలకు వేలు కట్టి అప్పుల పాలు కావాల్సిందే. ఎల్ఆర్ఎస్పై సబ్ రిజిస్ట్రార్‌ను అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదు. ప్రభుత్వం నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలి. ఇప్పటికే రియల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఉంటే వ్యాపారాలు బంద్ చేసుకోవాల్సిందే. ఇలానే ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రిలే దీక్షలు చేపడుతాం.
-పేరెపల్లి స్వామి గౌడ్, రియల్ వ్యాపారుల సంఘం చౌటుప్పల్ మండల అధ్యక్షుడు
ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించలేదు..
ఎల్ఆర్ఎస్పై క్రయవిక్రయదారులకు పూర్తి అవగాహన కల్పించలేదు. ఇప్పటికే మార్కెట్ లేని సమయంలో ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. గతంలో కొన్న ప్లాట్లు అమ్ముడుపోక అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పెట్టడం బాగాలేదు. ఇలానే సాగితే రియల్ వ్యాపారం పదేండ్ల వెనక్కి పోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి 2022కు ముందు జరిగిన డాక్యుమెంట్లకు ఎల్ఆర్ఎస్ లేకుండా చేయాలి. మిగతా వాటికి గడుపు పెంచాలి. ఇది వ్యాపారులకు ప్లాట్లు కొన్న పేదలకూ ఇబ్బందే.
-కేతరాజు శంకర్, రియల్ వ్యాపారి, తంగడపల్లి, చౌటుప్పల్